మునిసిపాలిటీల్లో జెండా ఎగరేద్దాం
ABN , Publish Date - Feb 04 , 2026 | 03:23 AM
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్రంలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
ఎన్నికలపై బీజేపీ అధినాయకత్వం దృష్టి
ముగ్గురు పార్టీ వ్యూహకర్తలకు బాధ్యతలు
మెజారిటీ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యం
సాధారణ ఎన్నికలకు పునాది వేసుకునే యత్నం
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్రంలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. స్థానిక సంస్థల్లో జెండా ఎగరేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఫలితాలు బలమైన పునాది అవుతాయని పార్టీ భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ఓటర్లు తమను ఎక్కువ ఆదరిస్తున్నారన్న విశ్వాసంతో ఉన్న కమలనాథులు మునిసిపాలిటీల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేరళ, ముంబై, అరుణాచల్‌ప్రదేశ్ స్థానికసంస్థల ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన నేపథ్యంలో తెలంగాణలోనూ అదే ఊపు కొనసాగించేందుకు రంగంలోకి దిగుతోంది. ఇటీవల ముంబై, తిరువనంతపురం కార్పొరేషన్ పీఠాలను బీజేపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తెలంగాణ మునిసిపల్ ఎన్నికలకు కూడా పార్టీ జాతీయ నాయకత్వం పకడ్బందీ కార్యాచరణతో బరిలోకి దిగింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఎన్నికలకు కేంద్ర పార్టీ ఇన్‌చార్జులను నియమించింది. ముంబై బీజేపీ సీనియర్ నేత ఆశిష్ సెలాల్‌కు మునిసిపల్ ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. ఆయనకు ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపు ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుని 48 డివిజన్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికలకు సెలాల్ సహ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. ఎన్నికల వ్యూహరచనలో విశేష అనుభవం ఉన్న రాజస్థాన్ బీజేపీ మాజీ చీఫ్ అశోక్ పర్ణామి, ఎంపీ రేఖాశర్మకు కూడా కేంద్ర నాయకత్వం ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించింది. మరోవైపు, వారం వ్యవధిలో ఇద్దరు అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండటం గమనార్హం. ఈ అగ్రనేతల ప్రచార సభలను ఉత్తర తెలంగాణలో ఒకటి, దక్షిణ తెలంగాణలో మరొకటి ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 8న నిర్మల్ పర్యటనకు రానున్నారు. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా విజయ్ సంకల్ప్ సభను నిర్వహించిన రాష్ట్ర నాయకత్వం, ఎన్నికల కార్యాచరణపై స్థానిక నాయకత్వానికి దిశానిర్దేశం చేసింది. ఎన్నికల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఎన్నికలు జరుగుతున్న 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో సీనియర్ నాయకులకు ఒక్కో మునిసిపాలిటీ బాధ్యతను అప్పగించింది. బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ల పరిధిలో 50 మునిసిపాలిటీలు, మూడు కార్పొరేషన్లు(కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్) ఉన్నాయి. వీటిని కైవసం చేసుకోవడంతో పాటు మెజారిటీ మునిసిపాలిటీల్లో పాగా వేసేందుకు పార్టీ ముఖ్య నేతలు కసరత్తు చేస్తున్నారు.