కేసీఆర్ దోచుకున్నదంతా కక్కిస్తానన్న హామీ ఏమైంది..?
ABN , Publish Date - Jan 31 , 2026 | 04:15 AM
మాజీ సీఎం కేసీఆర్ దోచుకున్నదంతా కక్కిస్తానని ఇచ్చిన హామీ ఏమైందని సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రశ్నించారు.
ఎందుకు మెత్తబడ్డారో ప్రజలకు రేవంత్ జవాబివ్వాలి
మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ దూకుడుకు కళ్లెం వేయాలి: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
నల్లగొండ, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్ దోచుకున్నదంతా కక్కిస్తానని ఇచ్చిన హామీ ఏమైందని సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. ఇప్పుడు ఎందుకు మెత్తబడ్డారో ప్రజలకు రేవంత్ సమాధానం చెప్పాలని నల్లగొండలో అన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థులు, యువత, రైతులు, మహిళల్లో వ్యతిరేకత ఏర్పడిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్న లక్ష్మణ్.. గత బీఆర్‌ఎస్ కుటుంబ అవినీతి పాలనతో ఇబ్బందులెదుర్కొన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశమిచ్చారని చెప్పారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కారు అభాసు పాలైందన్నారు. రాష్ట్రంలో 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ఉద్యోగులకు వేతనాలిచ్చే పరిస్థితి లేదన్నారు. మంత్రులు వాటాల కోసం కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి దూకుడుకు కళ్లెం వేయాలని ప్రజలకు లక్ష్మణ్ పిలుపునిచ్చారు.