మున్సి‘పోల్స్’తో డబుల్ ఇంజన్ సర్కారుకు పునాది
ABN , Publish Date - Jan 29 , 2026 | 05:54 AM
తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటుకు మున్సిపల్ ఎన్నికలు పునాది కానున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినకాంగ్రెస్, బీఆర్‌ఎ్‌స: రాంచందర్
పార్టీలో చేరిన పలువురు లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు
హైదరాబాద్, జనవరి 28, (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటుకు మున్సిపల్ ఎన్నికలు పునాది కానున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమయ్యాయని, బీజేపీ అన్ని సీట్లలో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే పార్టీ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో గతంలో ప్రజలు బీఆర్‌ఎ్‌సకు, తరువాత కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారని, కానీ రెండు పార్టీలు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచాయని విమర్శించారు. రెండు పార్టీలూ పాలనలో తీవ్రంగా విఫలయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళల్లో ఏ వర్గానికీ కూడా న్యాయం చేయలేదని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం కమిషన్ వ్యవస్థను 30-40 శాతానికి పెంచిందని ఆరోపించారు. మంత్రుల మధ్య కలహాలు, కాంట్రాక్టర్లు, కమిషన్ వ్యవస్థ రాష్ట్రంలో విస్తరించిందని పేర్కొన్నారు. రామచంద్రరావు సమక్షంలో పలువురు న్యాయవాదులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఇతర ప్రొఫెషనల్స్ బుధవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ భవిష్యత్తు కోసం మేధావులు ముందుకురావాలని, విద్య, ఉద్యోగాలు, రైతు సంక్షేమంపై ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు.