ఏటీఎం నుంచి మీకూ..డబ్బులు ముట్టాయా!?
ABN , Publish Date - Feb 27 , 2026 | 05:03 AM
కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్‌ఎస్ పార్టీకి ఏటీఎంలాంటిదని అమిత్ షా, నడ్డా పలుమార్లు చెప్పారు. మరి, కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి అప్పగిస్తే విచారణ ఎందుకు చేయడం లేదు...
కాళేశ్వరంపై సీబీఐతో విచారణ ఎందుకు జరపడం లేదు!?
బీజేపీని నిలదీసిన మంత్రులు పొంగులేటి, పొన్నం, వివేక్
ఒళ్లంతా విషం నింపుకొని బావ బామ్మర్ధుల నిరాధార ఆరోపణలు
కాళేశ్వరంపై చర్చ పెడితే పారిపోయారు: పొంగులేటి
బీఆర్‌ఎస్ హయాంలోనే కాళేశ్వరం కుంగింది: పొన్నం
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్ర జ్యోతి): ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్‌ఎస్ పార్టీకి ఏటీఎంలాంటిదని అమిత్ షా, నడ్డా పలుమార్లు చెప్పారు. మరి, కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి అప్పగిస్తే విచారణ ఎందుకు చేయడం లేదు!? ఆ ఏటీఎం నుంచి మీకూ నగదు బదిలీ జరిగిందా!?’’ అని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ బీజేపీని నిలదీశారు. బావా బామ్మర్ధులు ఒళ్లంతా విషం నింపుకొని ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ.. అచ్చోసిన ఆంబోతుల్లా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై కేంద్ర సంస్థలు ఇచ్చిన నివేదిక ఆధారంగానే పీసీ ఘోష్ కమిషన్ వేశామని, కేసును సీబీఐకి అప్పగించామని, బీజేపీ, బీఆర్‌ఎస్ లాలూచీతో విచారణ ముందుకు సాగడం లేదని దుయ్యబట్టారు. ప్రజలకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన ప్రతిపక్షం.. పింక్ ట్యూబ్‌లను అడ్డు పెట్టుకుని అబద్ధపు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సచివాలయంలో గురువారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్ నాయకుల తప్పుడు ప్రచారాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లీకేజీ గత పాలకుల హయాంలోనే వెలుగులోకి వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా విచారణ చేయించామని, అవి ఇచ్చిన నివేదికల ఆధారంగా పీసీ ఘోష్ కమిషన్ వేసి.. నివేదికపై అసెంబ్లీలో చర్చించామని రెవెన్యూ మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. అసెంబ్లీలో చర్చకు పెడితే.. కాళేశ్వరం అవినీతిపై చర్చించకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. ఆ తర్వాత బాధ్యతను సీబీఐకి అప్పగించి నెలలు గడుస్తున్నా విచారణ మొదలు కాలేదని, బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య ఫెవికాల్ బంధానికి ఇదే నిదర్శనమని ఆరోపించారు. కమీషన్లు ఎక్కడ వస్తే అక్కడ ప్రాజెక్టులు నిర్మించారని.. ఆయకట్టు అవసరాలు కాకుండా దోచుకునే లక్ష్యంతోనే ప్రాజెక్టుల రూపకల్పన చేశారని ఆరోపించారు.
తెలంగాణకు సంబంధించిన నీటి వాటాల విషయంలో ఒక్క చుక్క కూడా వదులుకునేది లేదని ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి పదే పదే చెప్పినా.. బావ, బామ్మర్ధి వంకర మాటలు మాట్లాడుతూనే ఉన్నారని మండిపడ్డారు. కాళేశ్వరం పేరుతో తిన్న రూ.లక్ష కోట్ల సొమ్ము ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో విషప్రచారం చేస్తున్నారని, శవాల మీద చిల్లర ఏరుకునే వారిలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. మార్చి 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని.. ఈ సారైనా ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రాజెక్టులు, నీటి వాటాల గురించి చర్చించాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టులపై ఎలాంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత పాలకుల స్వార్థపూరిత నిర్ణయాలతో రాష్ట్రం 15 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, దానిని అభివృద్ధి పథంలో నడిపి ముందుకు తీసుకెళ్లే బాధ్యతను రేవంత్ ప్రభుత్వం తీసుకుందని వివరించారు. అసెంబ్లీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్‌ఎస్ నాయకులు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలోనే కాళేశ్వరం కుంగిందని, ఏడాదికి 195 టీఎంసీలు ఎత్తిపోస్తామని చెప్పి.. ఏడేళ్లలో కేవలం 162 టీఎంసీలే ఎత్తి పోశారని, అందులోనూ 50 టీఎంసీలను మళ్లీ సముద్రంలోకి వదిలేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. కొండ పోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ పూర్తి చేసుకున్నారని, గౌరవెల్లిని మాత్రం పక్కన పెట్టేశారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వంపై విషం చిమ్ముతూ వ్యక్తిగత ప్రయోజనాలకే పరిమితమైందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం పేరుతో ఎనిమిదేళ్లు అవినీతి జరిగిందని, కమీషన్లు తీసుకున్నారని, ఫలితంగా దేశంలోనే అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీగా బీఆర్‌ఎస్ అవతరించిందని మంత్రి వివేక్ ఆరోపించారు. కమీషన్ల కోసం ప్రాజెక్టులు కట్టి.. సొంత ఆస్తులు పెంచుకున్నారని విమర్శించారు.