కుమారుడి పెళ్లికి ఆదివాసీ మహిళలను ఆహ్వానించిన భట్టి విక్రమార్క
ABN , Publish Date - Mar 05 , 2026 | 01:18 AM
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడు సూర్యవిక్రమాదిత్య వివాహానికి హాజరు కావాలని ఆదివాసీ మహిళలకు ఆహ్వానం అందింది.
ఉట్నూర్, మార్చి4 (ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడు సూర్యవిక్రమాదిత్య వివాహానికి హాజరు కావాలని ఆదివాసీ మహిళలకు ఆహ్వానం అందింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని దువుగూడా గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన మహిళలు మరప గంగుబాయి, సిడాం లక్ష్మీబాయి, గిరిజన రైతు మరప కోసు, సర్పంచ్ మరసుకోలా మహాదును భట్టి విక్రమార్క సాదరంగా ఆహ్వానించారు. ఈ మేరకు భట్టి పీఆర్‌వో ఉట్నూరు ఎంపీడీవో రాంప్రసాద్‌కు వాట్సాప్ ద్వారా ఆహ్వాన పత్రికను పంపి ఫోన్‌లో మాట్లాడారు. అలాగే, ఉమ్మడి జిల్లాలోని జైనూర్ మండలం బూసిమెట్ట గ్రామానికి చెందిన జానకి సుమన్‌బాయి, వేల లక్ష్మీబాయి, రుక్మబాయిలకు కూడా ఆహ్వానాలు అందాయి. గత జనవరిలో భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో వీరంతా ఆయనతో కలిసి నడిచారు. ఆ అనుబంధాన్ని గుర్తుంచుకున్న భట్టి, గురువారం శంషాబాద్ సమీపంలో జరగనున్న వివాహ వేడుకకు ప్రత్యేకంగా పిలిచారు. పంచాయ తీ కార్యదర్శి నాగజ్యోతి ఆధ్వర్యంలో వీరంతా వేడుకకు హాజరుకానున్నారు.