Share News

బీసీలకే పెద్దపీట

ABN , Publish Date - Feb 04 , 2026 | 03:39 AM

మునిసిపల్‌ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బీసీలకే అత్యధిక ప్రాధాన్యమిచ్చాయి. అధికార కాంగ్రె్‌సతోపాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌...

బీసీలకే పెద్దపీట

  • మునిసిపల్‌ ఎన్నికల్లో అత్యధిక సీట్లను కేటాయించిన పార్టీలు

  • వార్డులు, డివిజన్లలో బీసీలకు కాంగ్రెస్‌-53ు, బీఆర్‌ఎస్‌-53ు, బీజేపీ-49ు

  • ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ పర్వం.. బరిలో అభ్యర్థులపై స్పష్టత

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బీసీలకే అత్యధిక ప్రాధాన్యమిచ్చాయి. అధికార కాంగ్రె్‌సతోపాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ కూడా బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న మునిసిపాలిటీల్లో వార్డులు, మునిసిపల్‌ కార్పొరేషన్లలో డివిజన్లకు అభ్యర్థులుగా సింహభాగం బీసీలనే ఎంపిక చేశాయి. అధికార కాంగ్రెస్‌ 53.71 శాతం సీట్లను బీసీలకు కేటాయించగా, విపక్ష బీఆర్‌ఎస్‌ కూడా దాదాపు అంతే శాతం (53.79)లో బీసీలను మునిసిపల్‌ పోరులో రంగంలోకి దించింది. ఇక బీజేపీ.. కాస్త తక్కువగా 49.89 శాతం సీట్లను బీసీలకు కేటాయించింది. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ఆయా సీట్లలో తలపడే అభ్యర్థులెవరో తేలిపోయింది. బరిలో మిగిలిందెవరో స్పష్టత వచ్చింది. ఇదిలా ఉండగా.. బీసీల తర్వాత ఎస్సీలకు కాంగ్రెస్‌ 19 శాతం సీట్లను, బీఆర్‌ఎస్‌ 18.66 శాతం, బీజేపీ 15.80 శాతం సీట్లు కేటాయించాయి. ఇక ఎస్టీలకు పాలక, విపక్ష పార్టీలు రెండూ సమానంగా 7.66 శాతం సీట్లు కేటాయించగా, బీజేపీ 7.05 శాతం సీట్లను ఆ వర్గానికి కేటాయించింది. ఈ నెల 11న ఎన్నికలు జరగనుండగా.. 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మునిసిపాలిటీల్లో 2,582 వార్డులు, ఏడు కార్పొరేషన్లలో 414 డివిజన్లు కలిపి మొత్తం 2996 ఉన్నాయి.

బీసీలకు పోటా పోటీగా..

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బీసీలకు ఇస్తామన్న 42 శాతం రిజర్వేషన్లకు మించి సీట్లు కేటాయించాయి. కొన్ని జిల్లాల్లోనైతే అఽధికార కాంగ్రెస్‌ భారీగా సీట్లు కేటాయించింది. ఉదాహరణకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా 67.66 శాతం సీట్లలో బీసీ అభ్యర్థులను బరిలోకి దించింది. బీఆర్‌ఎస్‌ కూడా 60 శాతం సీట్లను బీసీలకు కేటాయించింది. బీజేపీ మాత్రం బీఆర్‌ఎస్‌ కంటే ఒక శాతం అదనంగా (61 శాతం) సీట్లు కేటాయించింది. మరికొన్ని చోట్ల పాలకపక్షం కంటే ప్రతిపక్ష బీఆరెస్సే బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చింది. ఉదాహరణకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 13 మునిసిపాలిటీల్లో 294 వార్డులు ఉండగా.. ఇక్కడ బీఆర్‌ఎస్‌ 127 మంది బీసీలకు టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్‌ 121 మంది బీసీలను బరిలోకి దించింది. అలాగే బైంసా మునిసిపాలిటీలో బీఆర్‌ఎస్‌ 46 శాతం వార్డులు బీసీలకివ్వగా, కాంగ్రెస్‌ కేవలం 26 శాతమే ఇచ్చింది. ఇక నిర్మల్‌లో బీజేపీ బీసీలకు ఏకంగా 90 శాతం సీట్లు కేటాయించగా, బీఆర్‌ఎస్‌ 71 శాతం, కాంగ్రెస్‌ 57 శాతం సీట్లు ఇచ్చాయి.

Updated Date - Feb 04 , 2026 | 03:39 AM