Share News

సీఎంకు పాలన చేతగాక.. తప్పించుకునే యత్నం!

ABN , Publish Date - Jan 29 , 2026 | 05:31 AM

రేవంత్‌రెడ్డికి పరిపాలన చేతగాక అప్పుల పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

సీఎంకు పాలన చేతగాక.. తప్పించుకునే యత్నం!

  • మునిసిపల్‌ ఎన్నికల్లో గొప్ప విజయం సాధించాలి

  • ఆరూరి రమేశ్‌ను బీఆర్‌ఎ్‌సలోకి ఆహ్వానించిన కేటీఆర్‌

హైదరాబాద్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): రేవంత్‌రెడ్డికి పరిపాలన చేతగాక అప్పుల పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజమెత్తారు. కేంద్రం, ఆర్బీఐ, కాగ్‌లు నామమాత్రపు రుణాలున్నాయని చెబుతున్నా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం అప్పుల సంఖ్య పెంచి తప్పుడు లెక్కలు చూపుతోందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ బీజేపీకి రాజీనామా చేసి తన అనుచరులతో కలిసి బుధవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎ్‌సలో చేరారు. కేటీఆర్‌ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వం తెచ్చిన ప్రతి పైసా అప్పును సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకే వినియోగించిందని గుర్తుచేశారు. కానీ, రేవంత్‌రెడ్డి రెండేళ్లలో తెచ్చిన రూ.2.50 లక్షల కోట్ల అప్పుతో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదన్నారు. అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్‌ సర్కారు పాలనకు వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాడాలని, రాబోయే మునిసిపల్‌ ఎన్నికల్లో గొప్ప విజయం సాధించాలని కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రమేశ్‌ గతంలో వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారని, దాదాపు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచిన ఆయన 16 ఓట్ల తేడాతో ఓడిపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పార్టీలో అందరినీ కలుపుకొని ముందుకెళ్లి, మునిసిపల్‌ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించాలని రమేశ్‌ను కోరారు.

Updated Date - Jan 29 , 2026 | 05:31 AM