న్యాయమూర్తుల నియామకానికి.. ఆలిండియా జ్యుడీషియల్ సర్వీస్ ఉండాలి
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:14 AM
న్యాయమూర్తుల నియామకాలకు జాతీయస్థాయిలో ఆలిండియా జ్యుడీషియల్ సర్వీస్ ఉండాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
రాజ్యసభలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): న్యాయమూర్తుల నియామకాలకు జాతీయస్థాయిలో ఆలిండియా జ్యుడీషియల్ సర్వీస్ ఉండాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం రాజ్యసభలో మాట్లాడుతూ ఆయన డివిజన్, జిల్లా స్థాయి న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు. జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక నియామక సంస్థ లేకపోవడంతో కిందిస్థాయి కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాల్లో ఒక్కో రాష్ట్రం ఒక్కో పద్ధతి అవలంభిస్తున్నాయన్నారు. రాష్ట్రాల్లోని కిందిస్థాయి కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాలకు జాతీయస్థాయిలో ప్రత్యేకంగా ఆలిండియా జ్యుడీషియల్ సర్వీస్ ఉండాలని కోరారు. ఆల్ ఇండియా జ్యుడీషియల్ సర్వీస్ నియమించుకోవచ్చని రాజ్యాంగంలోని ఆర్టికల్-312 అనుమతిస్తుందని లక్ష్మణ్ గుర్తుచేశారు. సర్వోన్నత న్యాయస్థానం కూడా పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి సూచించిందన్నారు. ఏఐజెఎస్ ఏర్పాటుతో కిందిస్థాయి కోర్టుల్లో ఖాళీలు త్వరితగతిన భర్తీ జరిగి, కేసులు త్వరితగతంగా పూర్తవుతాయని, సామాన్యులకు సత్వర న్యాయం లభిస్తుందన్నారు.