Share News

అహ్మదాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా చిన్నారులను తరలిస్తున్న ముఠా అరెస్టు

ABN , Publish Date - Jan 31 , 2026 | 04:14 AM

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి అప్పుడే పుట్టిన, రోజుల వయసున్న పొత్తిళ్లలోని చిన్నారులను కొనుగోలు చేసి దేశంలోని వివిధ రాష్ట్రాలకు తరలించి విక్రయుస్తున్న ముఠాను అహ్మదాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు

అహ్మదాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా చిన్నారులను తరలిస్తున్న ముఠా అరెస్టు

  • ముగ్గురిని అదుపులోకి తీసుకున్న అహ్మదాబాద్‌, ఏటీఎస్‌ పోలీసులు

  • నిందితుల్లో హైదరాబాద్‌కు చెందిన రోషన్‌ అగర్వాల్‌

హైదరాబాద్‌ సిటీ, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి అప్పుడే పుట్టిన, రోజుల వయసున్న పొత్తిళ్లలోని చిన్నారులను కొనుగోలు చేసి దేశంలోని వివిధ రాష్ట్రాలకు తరలించి విక్రయుస్తున్న ముఠాను అహ్మదాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలో హైదరాబాద్‌కు చెందిన రోషన్‌ అగర్వాల్‌తో పాటు.. యూపీకి చెందిన సుమిత్‌ యాదవ్‌, అహ్మదాబాద్‌కు చెందిన వందన పంచాల్‌ ఉన్నట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. వారి చెర నుంచి 15 రోజుల వయసున్న బాబును రక్షించారు. అహ్మదాబాద్‌కు చెందిన వందన పంచాల్‌ ఈ చైల్డ్‌ ట్రాఫికింగ్‌ ముఠాకు నాయకత్వం వహిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ఈ ముఠాలో రోషన్‌ అగర్వాల్‌ ఏజెంట్‌గా వ్యవహరిస్తూ.. హైదరాబాద్‌కు చిన్నారులను తరలించడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. 15 రోజుల వయసున్న చిన్నారిని కొంతమంది వ్యక్తులు అహ్మదాబాద్‌ ఇమ్మత్‌నగర్‌ నుంచి అక్రమ రవాణా చేస్తున్నట్లు అహ్మదాబాద్‌ క్రైమ్‌ బ్రాంచి, యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ (ఏటీఎస్‌) పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన రెండు విభాగాల పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించి అహ్మదాబాద్‌ విమానాశ్రయం సమీపంలోని కోరాట్‌పూర్‌ వద్ద అడ్డగించి అరెస్టు చేశారు. పసికందును రక్షించి స్థానిక ఆరోగ్య సంరక్షణా కేంద్రంలో అప్పగించారు. అహ్మదాబాద్‌లోని మున్నా అలియాస్‌ యూనస్‌ అనే వ్యక్తి వద్ద రూ. 3.60 లక్షలకు ఆ చిన్నారిని కొనుగోలు చేసి హైదరాబాద్‌లో ఎక్కువ మొత్తంలో డబ్బులకు విక్రయించడానికి ఆ ముఠా సన్నాహాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ చిన్నారిని రోషన్‌ అగర్వాల్‌ హైదరాబాద్‌లోని మరో ఏజెంట్‌ నాగరాజుకు అప్పగించనున్నాడు. ప్రస్తుతం యూనస్‌, నాగరాజు పరారీలో ఉన్నారు. గతంలోనూ చైల్డ్‌ ట్రాఫికింగ్‌ కేసులో వందన, రోషన్‌ అగర్వాల్‌ నిందితులుగా ఉన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ ఇదే దందాకు తెరతీసినట్లు పోలీసులు గుర్తించారు.

Updated Date - Jan 31 , 2026 | 04:14 AM