సింఘ్వీ, నరేందర్‌రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం
ABN , Publish Date - Mar 10 , 2026 | 03:26 AM
ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ, తెలంగాణ సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డిలు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రాజ్యసభ సభ్యులుగా ధ్రువీకరణ పత్రాలు అందజేసిన ఎన్నికల అధికారి
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ, తెలంగాణ సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డిలు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఎన్నికల అధికారి ఉపేందర్‌రెడ్డి వారికి ధ్రువీకరణ పత్రాలను అందించారు. వేం నరేందర్‌రెడ్డి తన ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని స్వయంగా తీసుకోగా.. అభిషేక్ సింఘ్వీ తరఫున సురేంద్ర చౌహాన్ స్వీకరించారు. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగిసింది. అప్పటికి రెండు సీట్లకు సింఘ్వీ, నరేందర్‌రెడ్డిల నామినేషన్లు మాత్రమే ఉన్నాయి. దీంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ రెండు సీట్లకు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సింఘ్వీ, సురేశ్‌రెడ్డిల పదవీ కాలం ఏప్రిల్ 9న ముగియనుంది. ఏప్రిల్ 10న సింఘ్వీ సభ్యత్వం రెన్యువల్ కానుంది. ఏప్రిల్ 9 తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచీ వేం నరేందర్‌రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగనున్నారు. ధ్రువీకరణ పత్రాల స్వీకరణ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, శాసనసభ, మండలి కార్యదర్శులు రెండ్ల తిరుపతి, నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం రాజ్యసభ వేదికగా పోరాడతానని వేం నరేందర్‌రెడ్డి చెప్పారు. ధ్రువీకరణ పత్రం అందుకున్న ఆయన అనంతరం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. 2004 నుంచి 2009 వరకూ ఎమ్మెల్యేగా పని చేసిన తాను.. ఇక నుంచి పార్లమెంటు వేదికగా పని చేయబోతున్నానని చెప్పారు. తాను వివాదాలకు దూరమని, పార్టీ ప్రయోజనాలే తన ప్రయోజనాలని తెలిపారు.