Share News

సింఘ్వీ ఆస్తులు 2,799 కోట్లు!

ABN , Publish Date - Mar 10 , 2026 | 03:25 AM

రాజ్యసభకు రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికైన ఇద్దరు అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ కుటుంబ.....

సింఘ్వీ ఆస్తులు 2,799 కోట్లు!

  • ఆయన పేరిట 1,625 కోట్లు.. భార్య పేరిట 1,174 కోట్ల స్థిర, చరాస్తులు

  • రూపాయి అప్పు కూడా లేదు

  • ఇతరులకు ఇచ్చిన రుణాలు 426 కోట్లు!

  • ఈసీకి ఇచ్చిన అఫిడవిట్లో వివరాలు వెల్లడి

హైదరాబాద్‌, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభకు రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికైన ఇద్దరు అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ కుటుంబ ఆస్తుల విలువ మొత్తం రూ.2799.84 కోట్లుగా తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన ఈ మేరకు తన కుటుంబ స్థిర, చరాస్తుల వివరాలను వెల్లడించారు. తన పేరిట మొత్తం రూ.1625.26 కోట్ల ఆస్తులున్నాయని పేర్కొన్నారు. తన భార్య అనితా సింఘ్వీ పేరిట మొత్తం రూ.1174.57 కోట్ల ఆస్తులున్నట్లు వివరించారు. వ్యక్తిగతంగా ఒక్క రూపాయి కూడా అప్పు లేదని, హిందూ అవిభాజ్య కుటుంబ(హెచ్‌యూఎఫ్‌) ఆస్తి కింద ఢిల్లీలో రూ.6 కోట్ల విలువైన 2.5 ఎకరాల స్థలం ఉందని పేర్కొన్నారు. పైగా ఇతరులకు ఆయన ఇచ్చిన వ్యక్తిగత రుణాలే రూ.426 కోట్ల మేరకు ఉన్నాయి. ఇందులో తన భార్య కంపెనీకి ఇచ్చిన రుణమే రూ.72.99 కోట్ల మేరకు ఉంది. చిత్ర కళల సేకరణ పట్ల అమితాసక్తి కలిగిన ఆయన విలువైన కళాఖండాలను సేకరించారు. వాటి విలువే రూ.25 కోట్లుగా పేర్కొన్నారు. తనకు, తన భార్యకు కలిపి రూ.160 కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నట్లు వెల్లడించారు.

వేం నరేందర్‌రెడ్డి ఆస్తులు రూ.41.5 కోట్లు

రాజ్యసభకు ఎన్నికైన మరో అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి తన కుటుంబ ఆస్తి విలువ మొత్తం రూ.41.5 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కుటుంబ ఆస్తి కింద అర్పణపల్లిలో 15.17 ఎకరాల భూమి, తన పేరిట కేసముద్రంలో 1050 గజాల వ్యవసాయేతర భూమి, హైదరాబాద్‌, వరంగల్‌, కేసముద్రంలో మూడు వాణిజ్య భవనాలు ఉన్నాయని వివరించారు. భార్య పేరిట కేసముద్రంలో 7.33 ఎకరాల భూమి ఉందని, మొత్తం రూ.1,62 కోట్ల అప్పు ఉందని తెలిపారు.

Updated Date - Mar 10 , 2026 | 03:25 AM