Share News

హైదరాబాద్‌లో అఖిల భారత పోలీసు ఫుట్‌బాల్‌ పోటీలు

ABN , Publish Date - Jan 29 , 2026 | 06:01 AM

హైదరాబాద్‌లో ఈ ఏడాది మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 5 వరకు 74వ బీఎన్‌ మల్లిక్‌ మెమోరియల్‌ ఆల్‌ ఇండియా పోలీసు ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు నిర్వహించనున్నట్లు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌లో అఖిల భారత పోలీసు ఫుట్‌బాల్‌ పోటీలు

  • 74వ బీఎన్‌ మల్లిక్‌ మెమోరియల్‌ ఛాంపియన్‌ షిప్‌

  • మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 5 వరకు 125 మ్యాచ్‌లు

  • డీజీపీ శివధర్‌ రెడ్డి వెల్లడి.. ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్‌, జనవరి 28(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఈ ఏడాది మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 5 వరకు 74వ బీఎన్‌ మల్లిక్‌ మెమోరియల్‌ ఆల్‌ ఇండియా పోలీసు ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు నిర్వహించనున్నట్లు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. ఈ పోటీల నిర్వహణపై బుధవారం డీజీపీ కార్యాలయంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ప్రతిభావంతులైన ఫుట్‌బాల్‌ క్రీడాకారులు ఉండేవారని, 1956లో మెల్బోర్న్‌ ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌ చేరిన భారత జట్టులో తెలంగాణకు చెందిన ఏడుగురు క్రీడాకారులున్నారని గుర్తు చేశారు. వీరిలో ఐదుగురు హైదరాబాద్‌ సిటీ పోలీసు విభాగానికి చెందినవారని చెప్పారు. జాతీయ స్థాయి పోలీసు ఫుట్‌బాల్‌ పోటీలు నిర్వహించే అవకాశం తెలంగాణ పోలీసుశాఖకు దక్కడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ పోటీలను విజయవంతం చేయడానికి అధికారులంతా చిత్తశుద్ధితో కృషిచేయాలని కోరారు. ఈ పోటీల్లో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 11 కేంద్ర సాయుధ బలగాలు, ఆరు కేంద్ర పోలీసు సంస్థల నుంచి మొత్తం 53 పురుషుల, మహిళల జట్లు పోటీ పడుతున్నాయని వెల్లడించారు. సుమారు 1,060 మంది పురుషులు, 350 మంది మహిళా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని వివరించారు. 12 రోజులు పాటు జరిగే పోటీల్లో మొత్తం 125 మ్యాచ్‌లు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామని, గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం, అజీజ్‌నగర్‌లోని హెచ్‌ఎ్‌ఫసీ గ్రౌండ్‌, మొయినాబాద్‌లోని శ్రీనిధి ఫుట్‌బాల్‌ క్లబ్‌ మైదానాల్లో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ మెగా ఈవెంట్‌ నిర్వహణకు తాను చైర్మన్‌గా, సైబరాబాద్‌ సీపీ డాక్టర్‌ ఎం.రమేష్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా, పరిపాలన కమిటీలో అభిలాష బిస్త్‌, అనిల్‌కుమార్‌, సంజయ్‌ కుమార్‌ జైన్‌, వీసీ సజ్జనార్‌, అవినాశ్‌ మహంతి, గజరావు భూపాల్‌ లాంటి సీనియర్‌ అధికారులుంటారని డీజీపీ చెప్పారు. మార్చి 25 మధ్యాహ్నం పోటీలు అధికారికంగా ప్రారంభం అవుతాయని, ఏప్రిల్‌ 5వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ముగింపు వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. పోలీసు అకాడమీలో క్రీడాకారులకు వసతి కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

Updated Date - Jan 29 , 2026 | 06:01 AM