Share News

ఆ మావోయిస్టులంతా ఏమైనట్టు?

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:33 AM

నమ్మిన సిద్ధాంతం కోసం దశాబ్దాల క్రితం అడవిబాట పట్టారు.. అజ్ఞాతంలో ఉన్నా అప్పుడప్పుడూ వారి పేర్లు వినిపించేవి.. వారు బతికున్నారని సొంతవాళ్లకు కాస్త భరోసా కలిగేది.

ఆ మావోయిస్టులంతా ఏమైనట్టు?

  • దేవ్‌జీ, దామోదర్‌ లొంగుబాటు తర్వాత చర్చనీయాంశంగా మారిన అదృశ్యాలు

  • మరణించారా? ఉద్యమాన్ని వదిలి వెళ్లారా?

  • ఎవరి చేతుల్లోనైనా హత్యకు గురయ్యారా?

  • అడవుల్లో చాలా మరణాలు రహస్యంగానే మిగిలిపోతాయంటున్న మావోయిస్టులు

  • వాంటెడ్‌ లిస్టు నుంచి 38 మంది పేర్లను తొలగించడంతో వారి కుటుంబాల్లో ఆందోళన

హైదరాబాద్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): నమ్మిన సిద్ధాంతం కోసం దశాబ్దాల క్రితం అడవిబాట పట్టారు.. అజ్ఞాతంలో ఉన్నా అప్పుడప్పుడూ వారి పేర్లు వినిపించేవి.. వారు బతికున్నారని సొంతవాళ్లకు కాస్త భరోసా కలిగేది. కానీ తర్వాత నెలలు, సంవత్సరాల కొద్దీ వారి జాడే లేదు. ఏమయ్యారో తెలియదు. దానికితోడు పోలీసు రికార్డుల్లో వాంటెడ్‌ లిస్టు నుంచి తాజాగా ఆ మావోయిస్టుల పేర్లను తొలగించడంతో ఆందోళన మొదలైంది. అడవుల్లో మరణించారా? ఉద్యమాన్ని వదిలివెళ్లి మరెక్కడైనా రహస్య జీవితం గడుపుతున్నారా? ఎవరి చేతుల్లో అయినా హత్యకు గురయ్యారా? అనే సందేహాలు ముసురుకుంటున్నాయి. పీపుల్స్‌వార్‌గా ఉద్యమం మొదలై మావోయిస్టులుగా రూపాంతరం చెందిన క్రమంలో అజ్ఞాతంలోకి వెళ్లిన 38 మంది తెలంగాణ మావోయిస్టుల జాడ తెలియకుండా పోయింది. తెలంగాణకు చెందిన మావోయిస్టులు 55 మంది ఇంకా అడవుల్లో ఉన్నారని తెలంగాణ పోలీసులు ఏడాది క్రితం వరకు చెప్పారు. కొందరు మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయిన తర్వాత.. తమ లెక్కలో పొరపాటు ఉందని ఇంకా 17మంది మాత్రమే పట్టుబడాల్సి ఉందని పేర్కొన్నారు. వారిలో ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్ల తర్వాత ఇంకా 11 మంది మాత్రమే లొంగిపోవాల్సి ఉందని ప్రకటించారు. మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తూ అజ్ఞాతంలో గడుపుతున్న వారి జాబితా నుంచి 38 మంది మాయం కావడం వారి కుటుంబాల్లో ఆందోళన రేపుతోంది. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ, బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ నుంచి అయినా తమవారి సమాచారం తెలుస్తోందా అన్న ఆశతో పోలీసు స్టేషన్లను సంప్రదిస్తున్నారు. వాంటెడ్‌ లిస్టు నుంచి చాలా మంది మావోయిస్టులను తొలగించడంపై మీడియా ప్రశ్నించినప్పుడు.. వారు అజ్ఞాతంలోకి వెళ్లి, ఉద్యమంలో పనిచేశారన్న సమాచారంతో లిస్టులో చేర్చామని డీజీపీ శివధర్‌రెడ్డి చెప్పారు. అయితే లొంగిపోయిన అగ్రనేతలను విచారించిన సమయంలో ఆ 38 మంది మావోయిస్టులకు సంబంధించిన ఎలాంటి సమాచారం వెలుగులోకి రాకపోవడంతో వాంటెడ్‌ జాబితా నుంచి తొలగించామన్నారు. వారు కొన్నేళ్ల క్రితమే పార్టీని వదిలి వెళ్లి ఉండాలని, లేదా మారుపేర్లతో జీవిస్తూ ఉండవచ్చని పేర్కొన్నారు.


అడవుల్లో చాలా మరణాలు రహస్యాలే!

లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత జంపన్న ఈ విషయంలో భిన్నంగా స్పందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సమయంలో నక్సల్స్‌పై తీవ్ర హింస కొనసాగినపుడు అనేకమంది అదృశ్యం అయ్యారని, అలా మాయమైన వారేమయ్యారో నేటికీ తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. ఎదురుకాల్పుల్లో మరణించిన మావోయిస్టుల కుటుంబాలకు వీలైనంత వరకు సమాచారం అందిస్తామని తెలిపారు. ప్రతి మావోయిస్టు మరణానికి కారణాలను పార్టీ అక్షరబద్ధం చేస్తుందని వివరించారు. అయినా అడవుల్లో వివిధ కారణాలతో జరిగిన మావోయిస్టుల మరణాలు చాలావరకు రహస్యంగానే మిగిలిపోతాయని పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టు నేతలతో మాట్లాడిన తర్వాతే పోలీసులు తాజా జాబితా ప్రకటించినట్టు స్పష్టమవుతోందని వెల్లడించారు. ఇక వివిధ రాష్ట్రాల్లో లొంగిపోయిన తెలంగాణకు చెందిన సెంట్రల్‌ కమిటీ నాయకులు సోనూ, ఆశన్నలతో సైతం తెలంగాణ ఎస్‌ఐబీ బృందాలు గతంలోని వాంటెడ్‌ జాబితాలోని మావోయిస్టులపై చర్చించారని సమాచారం. అయినా చాలా మంది వివరాలు తెలియలేదు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన దేవరకొండ సత్యనారాయణ అలియాస్‌ బుక్క సత్తన్న, బెజ్జారపు కిషన్‌, కొల్లు శ్రీనివాసరెడ్డి, రంగు అరుణ అలియాస్‌ పద్మక్క, కాశబోయిన స్వరూప తదితర మావోయిస్టుల వివరాల కోసం కుటుంబ సభ్యులు స్థానిక పోలీసు అధికారులను ఇటీవల సంప్రదించినట్టు తెలిసింది. పెద్దపల్లి, జగిత్యాల, జనగామ, సిద్దిపేట, మల్కాజిగిరి, అల్వాల్‌, మహబూబాబాద్‌, ములుగు ప్రాంతాలకు చెందిన మరికొందరు మావోయిస్టులు అదృశ్యమైన వారి జాబితాలో ఉన్నారని సమాచారం.

Updated Date - Feb 27 , 2026 | 12:33 AM