హైదరాబాద్‌లో యూట్యూబర్ దారుణ హత్య.. ఇంట్లోకి చొరబడి మరీ..
ABN , Publish Date - Jun 13 , 2026 | 01:11 PM
నగరంలో ఓ యూట్యూబర్ దారుణ హత్యకు గురయ్యాడు. ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి మరీ అతడిపై రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో యూట్యూబర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
హైదరాబాద్, జూన్ 13: నగరంలో ఓ యూట్యూబర్ దారుణ హత్యకు గురయ్యాడు. ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి మరీ అతడిపై రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో యూట్యూబర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గోల్కొండలోని కుమార్‌వాడి ఏరియాకు చెందిన యూట్యూబర్ షేక్ మహబూబ్ శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనలు ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు అతడిని ఫాలో అయ్యారు.
ఆ వ్యక్తులు తనను ఫాలో అవుతున్నారని గుర్తించిన మహబూబ్ పరుగున ఇంట్లోకి వెళ్లాడు. అయినా ఆ వ్యక్తులు వదల్లేదు. ఇంట్లోకి చొరబడి రాడ్లు, జిమ్ పరికరాలతో అతడిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ మహబూబ్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహబూబ్ బావమరిది(భార్య సోదరుడు) షేక్ సోహైల్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. సోహైల్ తన అనుచరులు అఫు, జాబిర్‌లతో కలిసి మహబూబ్‌ను రాడ్లతో దాడి చేసి చంపేసినట్లు అనుమానిస్తున్నారు.
కుటుంబ కలహాల కారణంగా హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం మహబూబ్ ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి అమ్మాయి తరఫు వారికి ఏమాత్రం ఇష్టం లేదు. మహబూబ్ దంపతులకు బిడ్డ పుట్టినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పురాలేదు. మహబూబ్, అతడి అత్తింటి వారికి మధ్య గొడవలు ఆగలేదు. ఈ కారణంతోటే మహబూబ్ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అన్ని వర్గాలకూ నాణ్యమైన వైద్య సేవలు: మంత్రి సత్యకుమార్
పాలవ్యాపారం.. నెలకు లక్షన్నర ఆదాయం