Share News

హైదరాబాద్‌లో 30 శాతం ఓట్లు హుళక్కే!

ABN , Publish Date - Jul 16 , 2026 | 05:50 AM

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)తో హైదరాబాద్‌ పరిధిలో ఎన్ని ఓట్లు ఎగిరిపోతాయోనన్న ఆసక్తికర చర్చ ఇప్పుడు నగరవాసుల్లో నడుస్తోంది.

హైదరాబాద్‌లో 30 శాతం ఓట్లు హుళక్కే!

  • ఏఎస్‌డీ జాబితాలో 25 శాతం ఓటర్లు

  • స్వగ్రామాల్లో ఓటుకు కొందరి మొగ్గు

  • అలా మరో 8-10 శాతం తొలగింపు

  • 25 శాతం ఎన్యుమరేషన్‌ ఫారాల సేకరణ

  • కొందరికి ఇప్పటికీ అందని ఫారాలు

హైదరాబాద్‌ సిటీ, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)తో హైదరాబాద్‌ పరిధిలో ఎన్ని ఓట్లు ఎగిరిపోతాయోనన్న ఆసక్తికర చర్చ ఇప్పుడు నగరవాసుల్లో నడుస్తోంది. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో జరిగిన సర్వేను పరిశీలిస్తే.. 30-35 శాతం వరకు ఓట్లు గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కొందరికి నగరంలోనే రెండు, మూడు చోట్ల ఓట్లుండగా.. మరి కొందరికి స్వగ్రామాల్లోనూ ఓటు హక్కు ఉండడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో పెద్ద మొత్తంలో ఓటర్ల పేర్లు తొలగించే అవకాశముందని జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం వర్గాలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్‌ జిల్లాలో మొత్తం 47.36 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు సేకరించిన ప్రాథమిక సమాచారం ఆధారంగా.. సుమారు 12 లక్షల (25 శాతం) ఓటర్లను ‘అందుబాటులో లేని/బదిలీ అయిన/మరణించిన వారి’ (ఏఎ్‌సడీ) జాబితాలో చేర్చారు. వీరిలో మెజారిటీ ఓట్లు ఎగిరిపోవచ్చన్నది అంచనా. ఏఎ్‌సడీ జాబితాలో పేరున్నప్పటికీ.. బూత్‌ స్థాయి అధికారి (బీఎల్‌ఓ)ని సంప్రదించి పూర్తి వివరాలతో ఎన్యుమరేషన్‌ ఫారం సమర్పిస్తే, ఓటు హక్కు కొనసాగుతుందని ఓ అధికారి తెలిపారు. స్వగ్రామాల్లోనూ ఓట్లున్న కొందరు నగరంలో ఫారాలు తీసుకున్నట్టు చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది స్వగ్రామంలో ఓటు హక్కుకే మొగ్గు చూపిస్తారని.. ఆ రూపంలో మరో 8 - 10 శాతం మంది నగరంలో ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు రంగారెడ్డి, మేడ్చల్‌ - మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలోనూ దాదాపు 22 లక్షలకుపైగా ఓట్లు తొలగించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.


నూరు శాతం ఫారాల పంపిణీ...

హైదరాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 100 శాతం ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, అందుబాటులో లేని, చిరునామా మారిన, మరణించిన ఓటర్లను ఏఎ్‌సడీ జాబితాలో చేర్చి.. వారికి సైతం ఫారాలు పంపిణీ చేసినట్టు అధికారికంగా చూపించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఇప్పటికీ తమకు ఫారాలు అందలేదని కొందరు ఓటర్లు చెబుతున్నారు. కానీ నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో 100 శాతం పంపిణీ చేసినట్టు ఎన్నికల సంఘానికి అధికారులు నివేదికలు పంపారు. ఏఎ్‌సడీ ఓటర్లు 24.33 శాతం ఉన్నటు గుర్తించగా, 25.52 శాతం ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్‌ ఫారాలు సేకరించామని.. దీంతో 50 శాతం మేర సర్వే పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన ఓటర్లలో వాస్తవంగా ఎంత మందికి ఫారాలు అందాయి? వారిలో ఎందరు పూరించి ఇస్తారు..? అన్నది ఆగస్టు 3వ తేదీ తరువాత తేలనుంది.

తుది జాబితాతోనే స్పష్టత..

ఆగస్టు 10వ తేదీన ముసాయిదా ఓటర్‌ జాబితా ప్రకటించి అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించనున్నారు. తమ/కుటుంబ సభ్యులకు సంబంధించి 2002 జాబితా ఆధారంగా ఓటర్‌ వివరాలు సమర్పించని వారికి.. ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు కార్డుల్లో ఒకదానిని సమర్పించే అవకాశం కల్పిస్తారు. అనంతరం వారి ఓటు ఉంచాలా..? తొలగించాలా..? అన్నది నిర్ణయిస్తారు. మొత్తంమీద అక్టోబరు 12న వెలువడే తుది ఓటర్‌ జాబితాతో ఎన్ని ఓట్లు నికరంగా ఎరిగిపోతాయోనన్న గందరగోళానికి తెరపడనుంది.

Updated Date - Jul 16 , 2026 | 05:52 AM