Share News

మరణించిన వారి ఎన్యుమరేషన్‌ ఫారాలు సమర్పిస్తే క్రిమినల్‌ కేసులు

ABN , Publish Date - Jul 29 , 2026 | 07:57 AM

మరణించిన వారి సర్‌ ఎన్యుమరేషన్‌ ఫారంపై కుటుంబ సభ్యులు సంతకం చేసి బూత్‌ లెవల్‌ ఆఫీసర్ల (బీఎల్‌ఓ)కు సమర్పిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ హెచ్చరించారు. మరణించిన వారి ఫారంలు ఎట్టి పరిస్థితుల్లో మ్యాపింగ్‌ చేయవద్దని..

మరణించిన వారి ఎన్యుమరేషన్‌ ఫారాలు సమర్పిస్తే క్రిమినల్‌ కేసులు

  • హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్‌ హెచ్చరిక

  • ఇప్పటికీ ఫారం రాకుంటే 1950కు ఫోన్‌ చేయాలని సూచన

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): మరణించిన వారి సర్‌ ఎన్యుమరేషన్‌ ఫారంపై కుటుంబ సభ్యులు సంతకం చేసి బూత్‌ లెవల్‌ ఆఫీసర్ల (బీఎల్‌ఓ)కు సమర్పిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ హెచ్చరించారు. మరణించిన వారి ఫారంలు ఎట్టి పరిస్థితుల్లో మ్యాపింగ్‌ చేయవద్దని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ అదనపు కమిషన్లు బదావత్‌ సంతోష్‌, చంద్రకళతో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు 3తో సర్‌ ప్రక్రియ ముగియనుందని, డిజిటైజేషన్‌కు అదే చివరి రోజని, ఆ లోపే ఓటర్లు ఫారాలు అందజేయాలని సూచించారు. ఓటరుజాబితాలో పేరు ఉండి ఇప్పటికీ ఫారాలు పొందని వారు బీఎల్‌ఓ, ఈఆర్‌ఓ లేదా 1950 నెంబర్‌కు ఫోన్‌ చేసి సంప్రదించాలన్నారు. ముసాయిదా జాబితాలో పేరుండి మ్యాపింగ్‌ చేయని, మ్యాపింగ్‌లో పొరపాట్లు ఉన్న ఓటర్లకు నోటీసులు ఇస్తామని చెప్పారు. సరైన పత్రాలు సమర్పిస్తే ఈఆర్‌ఓ నిర్ణయం మేరకు వారి పేరు తుది జాబితాలో ఉంటుందన్నారు. సొంత రాష్ట్రాల్లో సర్‌ ఫారం ఇచ్చేందుకు కొందరు ఆసక్తి చూపుతన్నారని, ఇంకొందరు ప్రస్తుతం ఆ చిరునామాల్లో ఉండడం లేదని చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల హేతుబద్దీకరణ ప్రక్రియను మూడో తేదీలోపు పూర్తి చేస్తామని అన్నారు. 1200 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్న పోలింగ్‌ కేంద్రాలను రెండుగా విభజిస్తామని తెలిపారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పెరిగే అవకాశముంది..

లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) గడువు పొడిగించే అవకాశముందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. ఈ నెల 31తో ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు ముగియనుంది. పట్టణ ప్రణాళికా విభాగంలోని ఉద్యోగులంతా సర్‌ విధుల్లో ఉండడం వల్ల ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలన ఆగిపోయింది. దీంతో ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పెంచాలని ట్రై కార్పొరేషన్లు ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది.

Updated Date - Jul 29 , 2026 | 07:57 AM