వైట్‌కాలర్ ఉద్యోగ నియామకాల్లో హైదరాబాద్ టాప్
ABN , Publish Date - Sep 09 , 2026 | 06:26 AM
భారత్‌లో వైట్ కాలర్ ఉద్యోగాల నియామకాల్లో గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 14ు మేర పెరిగిందని.. ప్రముఖ జాబ్ పోర్టల్ ‘నౌకరీడాట్ కామ్’ నివేదిక వెల్లడించింది. ఈ విషయంలో.. ఏకంగా 23ు వృద్ధితో దేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచినట్టు పేర్కొంది
నిరుడు ఆగస్టుతో పోలిస్తే ఈ ఆగస్టులో 23ు వృద్ధి
ప్రముఖ జాబ్ పోర్టల్ నౌకరీ డాట్ కామ్ వెల్లడి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: భారత్‌లో వైట్ కాలర్ ఉద్యోగాల నియామకాల్లో గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 14ు మేర పెరిగిందని.. ప్రముఖ జాబ్ పోర్టల్ ‘నౌకరీడాట్ కామ్’ నివేదిక వెల్లడించింది. ఈ విషయంలో.. ఏకంగా 23ు వృద్ధితో దేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచినట్టు పేర్కొంది. గత ఏడాది ఆగస్టులో ఆ వెబ్‌సైట్ విడుదల చేసిన ‘నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్’ సూచీ 2,664 పాయింట్లు ఉండగా.. ఈ ఏడాది ఆగస్టుకు అది 3,028 పాయింట్లకు చేరుకుంది. ఐటీ, ఐటీయేతర రంగాల్లో, అన్నిరకాల అనుభవాల స్థాయుల్లోనూ(సీనియర్, జూనియర్, ఫ్రెషర్) నియామకాల సంఖ్య పెరిగిందని.. ముఖ్యంగా ఆటోమొబైల్, ఆరోగ్య సంరక్షణ, రిటైల్ రంగాలు ఈ వృద్ధికి ప్రధాన కారణమని నౌక్రీడాట్‌కామ్ తన నివేదికలో పేర్కొంది. వీటిలో.. నియామకాల్లో ఆటోమొబైల్ రంగం 19శాతం వృద్ధితో ముందంజలో ఉండగా.. ఆరోగ్యసంరక్షణ రంగం 16ు, రిటైల్ రంగం 15ు వృద్ధి సాధించాయి. ఇక మెట్రో నగరాల్లో హైదరాబాద్ తర్వాత.. నియామకాల్లో 22శాతం వృద్ధితో కోల్‌కతా రెండో స్థానంలో నిలిచింది. అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితా చూస్తే.. నియామకాల్లో 32ు వృద్ధితో భువనేశ్వర్ అగ్రస్థానంలో నిలవగా.. రాయ్‌పూర్ (23శాతం), సూరత్ (21శాతం), రాంచీ (19శాతం ) తదుపరిస్థానాల్లో ఉన్నాయి.