సొంతూరికే ‘ఓటు’!
ABN , Publish Date - Jun 29 , 2026 | 04:55 AM
కోటికిపైగా జనాభా ఉన్న మహానగరం హైదరాబాద్.. ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్థిరపడిన వారు లక్షల్లోనే ఉంటారు. ఇప్పుడలాంటి వారంతా....
ఓటు ఉంటేనే ఊరిలో విలువ అనే భావన
గ్రేటర్ హైదరాబాద్‌లో నివసిస్తున్న కొందరికి ఊళ్లో, ఇక్కడా ఓటు హక్కు
‘సర్’తో ఎక్కడో ఒకచోట మాత్రమే పేరు.. దాంతో గ్రామాల్లోనే నమోదుకు ఆసక్తి
హైదరాబాద్‌లో వివరాలిచ్చేందుకు అనాసక్తి
మహానగరంలో ఓటర్ల సంఖ్య తగ్గే చాన్స్!
‘సర్’ ప్రక్రియలో సమస్యలు, సవాళ్లు
హైదరాబాద్ సిటీ, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): కోటికిపైగా జనాభా ఉన్న మహానగరం హైదరాబాద్.. ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్థిరపడిన వారు లక్షల్లోనే ఉంటారు. ఇప్పుడలాంటి వారంతా ‘ఓటు’ కోసం సొంతూరువైపు చూస్తున్నారు. ఇన్నాళ్లూ అలాంటి వారికి అటు గ్రామంలో, ఇటు మహానగరంలోనూ ఓటు ఉండగా.. ఇప్పుడు ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)తో ఎక్కడో ఒకచోటే ఓటు హక్కు ఉండనుంది. దీనితో చాలా మంది సొంత ఊరిలోనే నమోదు చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఊళ్లో భూములు, ఇల్లు, ఇతర ఆస్తులు ఉండడం, ఓటు హక్కు ఉంటేనే గ్రామంలో విలువ అన్న భావన వంటివి దీనికి కారణమని చెబుతున్నారు. కాగా, ‘సర్’ ప్రక్రియలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్, జాబితాల పరిశీలన చాలా లోతుగా చేపడుతున్నారు. బోగస్, అనర్హుల పేర్లు, చనిపోయిన, వలస వెళ్లిపోయినవారి పేర్లను జాబితా నుంచి తొలగించేలా పకడ్బందీగా సర్వే చేస్తున్నారు. 2002 నాటి సర్ వివరాలతో పోల్చి చూస్తున్నారు. నాడు ఓటు హక్కు లేనివారి వివరాలను తల్లిదండ్రులు, తాత, నానమ్మ/అమ్మమ్మ వివరాలతో మ్యాపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఏదో ఒకచోటే ఓటు నమోదుకు అవకాశం ఉండనుంది.
నగరంలోనూ డూప్లికేట్ ఓట్లతో..
తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలతోపాటు, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, బిహార్, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందినవారు హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. వారిలో చాలా మందికి ఇక్కడ ఓటు ఉంది. నగరంలో అద్దెకు ఉంటూ వేర్వేరు ప్రాంతాలకు మారినప్పుడు కొందరు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకుంటుంటారు. అలాంటి వారికి రెండు, మూడు చోట్ల ఓటు హక్కు ఉంది. హైదరాబాద్ జిల్లాలో 47.36 లక్షల ఓట్లు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 76.96 లక్షల ఓట్లు ఉండడానికి ఇదీ కారణమేనని అధికారులు చెబుతున్నారు. అలాంటి డూప్లికేట్ ఓట్లు తొలగిపోనున్నాయి. దానికితోడు చాలా మంది సొంతూళ్లకే మొగ్గుచూపుతున్న నేపథ్యంలో.. హైదరాబాద్ పరిధిలో వారి ఓట్లను తొలగించే అవకాశముంది. దీనితో నగరంలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఏకంగా 30శాతం ఓట్లు తగ్గవచ్చని అంటున్నారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ విభాగాలు సర్ ప్రక్రియకు ముందు నిర్వహించిన సర్వేలో 46శాతం ఓటర్ల వివరాలు మాత్రమే మ్యాపింగ్ జరిగాయి. బీఎల్వోలు ప్రతి ఓటర్ వద్దకు వెళ్లకపోవడం, చనిపోయిన, చిరునామా మారినవారి ఓట్లు ఇప్పటికీ జాబితాలో ఉండటం, కొందరికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
ఓటు ఉంటేనే విలువ అని..
’సొంత ఊరిలో ఓటు హక్కు లేకుంటే విలువ ఉండద’న్న అభిపాయ్రం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఓటు లేకుంటే గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించవేమో, గ్రామంలో ఏదైనా సమస్య వస్తే.. స్థానిక నాయకులు అండగా ఉండరేమో అన్న ఆందోళన కనిపిస్తోంది. ఊళ్లో భూములు, ఇల్లు, ఇతర ఆస్తులున్నవారు సొంతూళ్లోనే ఓటు హక్కు ఉండాలని కోరుకుంటుండగా.. దశాబ్దాల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడిన వారు.. ఇక్కడే ఓటర్‌గా ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు.
సర్ ప్రక్రియలో సమస్యలు, సవాళ్లు!
రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ సమస్యలు, సవాళ్ల మధ్య కొనసాగుతోంది. అధికారులు దృష్టి పెట్టకపోవడంతో పట్టణప్రాంతాల్లో ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ సక్రమంగా జరగడం లేదు. రాష్ట్రంలోని 3.38 కోట్ల మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ చేయడం, వాటిని ేసకరించడం, వివరాలను పరిశీలించడం, డిజిటల్‌గా నమోదు చేయడం వంటివన్నీ నిర్ణీత సమయంలో పూర్తిచేయాల్సి ఉండటంతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్టు బూత్‌లెవల్ ఆఫీసర్లు వాపోతున్నారు. గ్రామీణప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నా.. పట్టణ ప్రాంతాల్లో భారీగా ఓటర్లు, వివరాల్లో గణనీయంగా తేడాలు ఉండటం, ఓటర్లలో పెద్దగా ఆసక్తి కనబడకపోవడం వంటివి ‘సర్’ వేగానికి అడ్డుకట్ట వేస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు ఉండటం, ఉద్యోగాలు/ఉపాధి కోసం పొద్దంతా బయటే ఉండేవారు ఎక్కువగా ఉండటంతో బీఎల్వోలు ప్రత్యక్షంగా ఓటర్లను కలవడం కష్టమవుతోంది. హైదరాబాద్‌తోపాటు పలు పట్టణ ప్రాంతాల్లో బీఎల్వోలకు ఎన్యుమరేషన్ ఫారాలు ఆలస్యంగా అందాయి. దానికితోడు ‘పల్స్‌పోలియో’ కార్యక్రమంతో ఆశా వర్కర్లు బిజీగా ఉండటంతోనూ ‘సర్’ నెమ్మదించింది. ఇక అంగన్‌వాడీ టీచర్లకు ఇచ్చిన ఫోన్లలో.. సర్ యాప్ సరిగా పనిచేయడం లేదని, వివరాలు అప్‌లోడ్ చేయడం ఇబ్బందిగా మారిందని అంటున్నారు.