ఆ బస్సులకు నోఎంట్రీ!
ABN , Publish Date - Sep 16 , 2026 | 04:38 AM
హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, వాహన కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు ప్రజలకు మెరుగైన ప్రజా రవాణా సౌకర్యాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌కు నలువైపులా గాజులరామారం, శంషాబాద్, ఎల్బీనగర్, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో ఆధునిక బస్ టెర్మినల్స్ ఏర్పాటు ప్రతిపాదనలపై ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడించారు.
ఆర్టీసీ, ప్రైవేటు సహా అన్ని అంతర్రాష్ట్ర బస్సులు హైదరాబాద్ శివారు వరకే..
గాజులరామారం, శంషాబాద్,
ఎల్బీనగర్, ఘట్‌కేసర్‌లో బస్ టెర్మినల్స్
మెట్రో, ఎంఎంటీఎస్, సిటీ బస్సులతో
అనుసంధానం: మంత్రి పొన్నం
హైదరాబాద్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, వాహన కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు ప్రజలకు మెరుగైన ప్రజా రవాణా సౌకర్యాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌కు నలువైపులా గాజులరామారం, శంషాబాద్, ఎల్బీనగర్, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో ఆధునిక బస్ టెర్మినల్స్ ఏర్పాటు ప్రతిపాదనలపై ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు వైపు నుంచి హైదరాబాద్‌లోకి వచ్చే దూరప్రాంత, అంతర్‌జిల్లా, అంతర్రాష్ట్ర బస్సులను నగరంలోకి రానీయకుండా ఆయా మార్గాల్లో ఏర్పాటు చేసే టెర్మినల్స్ వరకు మాత్రమే నడిపించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి పొన్నం మంగళవారం వెల్లడించారు. శంషాబాద్ విమానాశ్రయం వైపు వెళ్లే బస్సులు, హైదరాబాద్‌కు వచ్చే అంతర్‌జిల్లా బస్సులు కూడా అవసరాన్ని బట్టి నిర్దేశిత టెర్మినల్స్ వద్ద నుంచే రాకపోకలు సాగించేలా ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. ఆయా టెర్మినల్స్ నుంచి ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సులభంగా చేరుకునేందుకు సిటీ ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు, ఎంఎంటీఎస్ ేసవలను సమన్వయం చేయాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ప్రైవేట్ బస్సుల వల్ల ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారంగా ప్రైవేట్ బస్సులు కూడా నిర్దేశిత బస్ టెర్మినల్స్ నుంచి రాకపోకలు కొనసాగించడంపై ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందన్నారు. నిబంధనల మేరకు యూజర్ చార్జీలు చెల్లించి ప్రైవేటు ఆపరేటర్లు టెర్మినల్స్‌ను వినియోగించుకునే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
వివిధ రాష్ట్రాలకు వెళ్లే ప్రైవేటు, ఆర్టీసీ దూరప్రాంత బస్సులు టెర్మినల్స్ వరకు మాత్రమే నడిపించే విధానం అమల్లోకి వస్తే.. హైదరాబాద్ ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందన్నారు. బస్ టెర్మినల్స్ ఏర్పాటుకు అవసరమైన భూమి విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని పొన్నం తెలిపారు. గాజులరామారంలో సుమారు 100 ఎకరాలు, శంషాబాద్ వైపు సుమారు 150 ఎకరాల భూమిని బస్ టెర్మినల్ అవసరాలకు కేటాయించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. కాగా, మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంటింటా కుట్టుమిషన్ల పథకం దరఖాస్తుల గడువును పొడిగించారు. ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు.