Share News

డ్రగ్స్‌ దందా గుట్టు రట్టు

ABN , Publish Date - Nov 10 , 2026 | 06:37 AM

: బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు పర్యాటక వీసాతో వచ్చి, నకిలీ ఆధార్‌, పాన్‌కార్డుతో భారతీయురాలిగా చెలామణి అవ్వడమే కాకుండా వ్యభిచారం, డ్రగ్స్‌ దందాలకు పాల్పడుతున్న మహిళను పోలీసులు పట్టుకున్నారు.

డ్రగ్స్‌ దందా గుట్టు రట్టు
drugs

  • బంగ్లాదేశ్‌ మహిళతోపాటు మరో వ్యక్తి అరెస్ట్‌

హైదరాబాద్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు పర్యాటక వీసాతో వచ్చి, నకిలీ ఆధార్‌, పాన్‌కార్డుతో భారతీయురాలిగా చెలామణి అవ్వడమే కాకుండా వ్యభిచారం, డ్రగ్స్‌ దందాలకు పాల్పడుతున్న మహిళను పోలీసులు పట్టుకున్నారు. బంగ్లాదేశీయురాలితోపాటు ఆమెతో సహజీవనం చేస్తున్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సింథటిక్‌ డ్రగ్స్‌, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈగల్‌ ఫోర్స్‌, సైబరాబాద్‌ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈగల్‌ ఫోర్స్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్‌కు చెందిన ఆల్ఫా(పేరు మార్చారు) 2021 డిసెంబరులో పర్యాటక వీసాపై భారత్‌కు వచ్చింది. ఆమెకు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన నూర్‌... ఉపాధి పేరుతో ఆమెను వ్యభిచారంలోకి దించాడు. 2021లో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి శ్యాంరావుతో పరిచయం ఏర్పడగా, అతనితో సహజీవనం చేస్తోంది. అతడికి తెలియకుండా వ్యభిచార కార్యకలాపాలు కొనసాగించేది. ఈ క్రమంలో సింథటిక్‌ డ్రగ్స్‌కు అలవాటుపడిన ఆమె.. గోవాకు చెందిన ఆకాష్‌ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేేసది. తనకు పరిచయమైన వారికి, కస్టమర్లకు సైతం డ్రగ్స్‌ సరఫరా చేయడం ప్రారంభించింది. తాజాగా ఆమె గోవా నుంచి డ్రగ్స్‌తో హైదరాబాద్‌కు వచ్చినట్లు పక్కా సమాచారం అందడంతో ఈగల్‌ ఫోర్స్‌, రాయదుర్గం పోలీసులు షేక్‌పేటలోని ఆమె నివాసంపై దాడి చేశారు. ఆల్ఫాతోపాటు శ్యాంరావును అదుపులోకి తీసుకుని సోదాలు నిర్వహించగా ఒక గ్రాము సింథటిక్‌ డ్రగ్స్‌, రెండు సెల్‌ఫోన్లు లభించాయి. ఈ వ్యవహారంలో గోవాకు చెందిన డ్రగ్స్‌ సరఫరాదారు ఆకాష్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Nov 10 , 2026 | 06:57 AM