Share News

కాల్‌సెంటర్‌ దందా సూత్రధారి అరెస్ట్‌

ABN , Publish Date - Jul 29 , 2026 | 07:29 AM

అమెరికన్‌ పౌరులను లక్ష్యంగా చేసుకుని సైబర్‌ మోసానికి పాల్పడిన వీసీ సొల్యూషన్స్‌ అనే కాల్‌సెంటర్‌ యజమాని వికాస్‌కుమార్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇంటర్‌పోల్‌ ద్వారా అమెరికన్‌ ఎంబసీ అందించిన సమాచారం ఆధారంగా 2023లో ఈ కాల్‌సెంటర్‌ దందాపై మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

కాల్‌సెంటర్‌ దందా సూత్రధారి అరెస్ట్‌

అమెరికన్లే లక్ష్యంగా సైబర్‌ నేరాలు

హైదరాబాద్‌, జూలై28(ఆంధ్రజ్యోతి): అమెరికన్‌ పౌరులను లక్ష్యంగా చేసుకుని సైబర్‌ మోసానికి పాల్పడిన వీసీ సొల్యూషన్స్‌ అనే కాల్‌సెంటర్‌ యజమాని వికాస్‌కుమార్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇంటర్‌పోల్‌ ద్వారా అమెరికన్‌ ఎంబసీ అందించిన సమాచారం ఆధారంగా 2023లో ఈ కాల్‌సెంటర్‌ దందాపై మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుల నుంచి కాజేసిన సొమ్మును క్రిప్టో కరెన్సీ రూపంలో నిందితులు సొంత ఖాతాలకు మళ్ళించారన్న ఆరోపణలతో సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాయి. వీరు హైదరాబాద్‌లోనే కాకుండా విశాఖపట్నం, లఖన్‌వూలో కూడా కాల్‌సెంటర్లు తెరిచారు. అమెరికన్లకు ఫోన్‌ చేసి, మీకు నేరాలతో సంబంధం ఉందని బెదిరించి, వారి నుంచి డబ్బు కాజేశారు.

కంప్యూటర్‌ వైరస్‌లు, బ్యాంక్‌ ఖాతా సమస్యలు, సెక్యూరిటీ అలర్ట్‌ల పేరిట వికాస్‌ ముఠా అమెరికన్ల నుంచి భారీగా డబ్బు వసూలు చేసింది. గిఫ్ట్‌కార్డులు, క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బు సేకరించినట్లు దర్యాప్తులో తేలింది. హవాలా మార్గాల ద్వారా డబ్బు తరలింపు, షెల్‌ కంపెనీల ఏర్పాటుతో కాజేసిన సొమ్మును భారత కరెన్సీగా ఈ ముఠా మార్చిందని వెల్లడైంది. అయితే ఈ ఆదాయం కిరాణా ఇతర వ్యాపారాల ద్వారా వచ్చినట్లు వికాస్‌ చూపుతున్నారని, దీనికి సంబంధించి డిజిటల్‌ ఆధారాలు సేకరిస్తున్నామని ఈడీ పేర్కొంది. న్యాయస్థానంలో మంగళవారం నిందితుడిని ఈడీ అధికారులు హాజరుపరిచారు.

Updated Date - Jul 29 , 2026 | 07:29 AM