Share News

రాష్ట్ర పక్షిని బోనులో బంధిస్తే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్‌

ABN , Publish Date - Oct 22 , 2026 | 06:22 AM

తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను బోనులో బంధించి పైశాచికానందాన్ని పొందితే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ హెచ్చరించారు

రాష్ట్ర పక్షిని బోనులో బంధిస్తే   కఠిన చర్యలు: సీపీ సజ్జనార్‌
SAJJANAR

తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను బోనులో బంధించి పైశాచికానందాన్ని పొందితే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ హెచ్చరించారు. దసరా సందర్భంగా కొంతమంది పోకిరీలు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పాలపిట్టలను బంధించిన విషయం తెలిసిన సిటీ పోలీసులు.. రంగంలోకి దిగి నాలు పాలపిట్టలను కాపాడి, అటవీ శాఖ అధికారుల సహకారంతో స్వేచ్చగా వదిలేసినట్లు తెలిపారు. ఈ మేరకు సీపీ ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. నగర ప్రజలకు దిశా నిర్థేశం చేస్తూ పోస్టు చేశారు. ఉప్పల్‌ మినీ స్టేడియంలో జరిగిన దసరా వేడుకల్లో పాలపిట్టను ఎగురవేసిన ఘటనపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఉప్పల్‌కు చెందిన చంద్రశేఖర్‌, పరమేశ్వర్‌రెడ్డితోపాటు మరికొందరి ప్రమేయం ఉననట్లు గుర్తించినట్లు మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లా అటవీ అధికారి వేణుమాధవ్‌ తెలిపారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులో నిర్వహించిన దసరా వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి తదితరులు పాలపిట్టలను ఎగురవేశారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని జిల్లా అటవీ శాఖ అధికారి విశాల్‌ బత్తుల తెలిపారు.

Updated Date - Oct 22 , 2026 | 06:22 AM