పండుగ వేళ హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. వైన్స్ వద్ద ఘర్షణలో వ్యక్తి మృతి
ABN , Publish Date - Nov 08 , 2026 | 04:05 PM
పండుగ పూట హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. అత్తాపూర్ బల్కంపేట వైన్స్ వద్ద సిబ్బందితో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, నవంబర్ 8: నగరంలోని రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ పిల్లర్ నంబర్ 140 సమీపంలో ఉన్న బల్కంపేట ఓ వైన్స్ వద్ద తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. పండుగ పూట సంతోషంగా గడపాల్సిన ఓ కుటుంబంలో ఈ ఘటన తీరని విషాదాన్ని నింపింది. మద్యం సేవించేందుకు వైన్స్ వద్దకు వచ్చిన 43 ఏళ్ల నాగరాజుకు వైన్స్ సిబ్బందితో ఘర్షణ జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో మాటామాటా పెరిగి వివాదం తీవ్రరూపం దాల్చినట్లు తెలుస్తోంది. అనంతరం వైన్స్ సిబ్బంది నాగరాజుపై దాడికి పాల్పడినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఘర్షణ సమయంలో నాగరాజును కింద పడేసి తొక్కినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో ఆయన గుండె భాగంలో బలమైన దెబ్బ తగిలి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న నాగరాజు చివరకు మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పండుగ సమయంలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కుటుంబానికి ఆధారంగా ఉన్న నాగరాజు మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగరాజు మృతికి వైన్స్ సిబ్బంది దాడే కారణమని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు అత్తాపూర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.