రాయదుర్గం భూముల ఒరిజినల్ లేఅవుట్‌ను ఎందుకు మార్చారు?
ABN , Publish Date - Sep 11 , 2026 | 04:30 AM
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో ఇటీవల వేలం వేసిన భూముల ఒరిజినల్ లేఅవుట్ ప్లాన్‌ను ఎందుకు మార్చారో వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్వే నెంబర్ 83/1 లోని 5.25 ఎకరాలు, 5.38 ఎకరాల విస్తీర్ణం కలిగిన పీ-1, పీ-2 ప్లాట్లకు సంబంధించిన ఒరిజినల్ లేఅవుట్ ప్లాన్ సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది.
ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు
వేలంపై స్టేకు నిరాకరణ
హైదరాబాద్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో ఇటీవల వేలం వేసిన భూముల ఒరిజినల్ లేఅవుట్ ప్లాన్‌ను ఎందుకు మార్చారో వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్వే నెంబర్ 83/1 లోని 5.25 ఎకరాలు, 5.38 ఎకరాల విస్తీర్ణం కలిగిన పీ-1, పీ-2 ప్లాట్లకు సంబంధించిన ఒరిజినల్ లేఅవుట్ ప్లాన్ సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది. అసలు లేఅవుట్‌లో ప్లాట్ నెంబర్ 6, 7, 11, 12, 13గా ఉండగా, దాన్ని పీ-1, పీ-2 ప్లాట్లుగా ఎందుకు సవరించాల్సి వచ్చిందో వివరించాలని తెలిపింది. అందుకు సంబంధించిన రికార్డులు సమర్పించాలని పేర్కొంది. అయితే ఆగస్టు 21న నిర్వహించిన ఆ వేలం, తదనంతర ప్రక్రియలపై స్టే ఇవ్వడానికి మాత్రం కేసుపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌ల ధర్మాసనం నిరాకరించింది. ఈ ప్లాట్లలో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రాక్‌ఫార్మేషన్స్ ఉన్నందున ఆ వేలాన్ని రద్దు చేయాలని కోరుతూ బేగంపేట్‌కు చెందిన జువ్వాడి ప్రణయ్ సింహారావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఈ ఆదేశాలు ఇచ్చింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది దామ శేషాద్రినాయుడు వాదిస్తూ.. దుర్గం చెరువు సమీపంలో ఉన్న ఈ ప్లాట్లలో రాక్‌ఫార్మేషన్స్ ఉన్నాయని, ఈ విషయమై జీవోలు జారీ అయ్యాయని తెలిపారు. ఇందుకు సంబంధించి 1998 నుంచి జారీ అయిన పలు జీవోలను ఉదహరించారు. వాటిని ఉల్లంఘించినందున వేలం, తదనంతర ప్రక్రియపై స్టే ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ.. గత జీవోలకు ఎలాంటి భంగం కలగలేదని చెప్పారు. 50 మీటర్ల బఫర్‌జోన్‌ను ఏర్పాటు చేసిన తర్వాతే రాక్ ఫార్మేషన్, వారసత్వ ప్రాంతం లేని ప్లాట్లనే వేలంలో విక్రయించామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా చాలా భూములను వేలం వేశారని.. అభివృద్ధి కోసం భూముల వేలం తప్పదని పేర్కొన్నారు. ప్రస్తుత ప్లాట్ల విక్రయ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, వేలం మొత్తంలో 25 శాతం ప్రభుత్వానికి వచ్చిందని తెలిపారు. ఈ దశలో ఎలాంటి స్టే ఇవ్వరాదని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం పాత లేఅవుట్ లోని ప్లాట్లను రివైజ్ చేసి కొత్త లేఅవుట్ ఎందుకు చేశారో కారణాలను వివరించాలని ఆదేశించింది.