బీసీ గురుకులాల్లో ఉపాధ్యాయులకు హాస్టల్ డ్యూటీలు వేస్తే తప్పేముంది?
ABN , Publish Date - Sep 16 , 2026 | 01:56 AM
మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల బోధనా సిబ్బందికి హాస్టల్ డ్యూటీలు, నైట్ డ్యూటీలు వేయడం చెల్లదంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ నే ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
నేను రామకృష్ణ మఠం గురుకులంలోనే చదువుకున్నా
హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ వ్యాఖ్య
హైదరాబాద్, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల బోధనా సిబ్బందికి హాస్టల్ డ్యూటీలు, నైట్ డ్యూటీలు వేయడం చెల్లదంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్టింగ్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) మార్గదర్శకాల ప్రకారం 1:50 నిష్పత్తిలో వార్డెన్లు ఉండాలని, అందుకు విరుద్ధంగా బోధనా సిబ్బందిని హాస్టల్ డ్యూటీలకు వినియోగిస్తున్నారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రాథమికంగా పరిశీలిస్తే అందులో తప్పేముందని అంటూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య మరింత అనుబంధం పెరిగి మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. తాను స్వయంగా రామకృష్ణ మఠానికి చెందిన గురుకులంలో చదువుకున్నానని, తనకు పాఠాలు బోధించిన గురువు ప్రస్తుతం రామకృష్ణ మఠం వైస్ చైర్మన్ అయ్యారని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. ఇటీవల తన గురువు హైదరాబాద్ రామకృష్ణ మఠానికి వస్తే వెళ్లి కలిశానని, తమ మధ్య తండ్రీకొడుకుల బంధం ఉందని ఆయన తెలిపారు. కాగా, బోధనా సిబ్బందికి హాస్టల్ డ్యూటీలపై విద్యాశాఖ అభిప్రాయం తెలుసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఆ శాఖ తరఫు న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
నేతన్న సేవ’ కింద ఒక్కో నేతన్నకు రూ.25 వేల ఆర్థిక సాయం: మంత్రి జనార్దన్ రెడ్డి
ఆరోగ్యవంతమైన ఏపీ కోసం ఎన్డీఏ సర్కార్ పనిచేస్తుంది: సీఎం చంద్రబాబు