Share News

రాష్ట్రవ్యాప్తంగా జోరు వాన

ABN , Publish Date - Jun 14 , 2026 | 04:47 AM

రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జోరు వాన కురిసింది. 30 జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 621 మండలాలు ఉండగా.. 435 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

రాష్ట్రవ్యాప్తంగా జోరు వాన

  • రంగారెడ్డి జిల్లా కేశంపేటలో అత్యధికంగా 9.7 సెం.మీ,సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో 9.1 సెం.మీ వర్షపాతం

  • హైదరాబాద్‌లో ఇంటిపై తాటి చెట్టు పడి వృద్ధురాలి మృతి

  • సంగారెడ్డిలో అసిస్టెంట్‌ లైన్‌మన్‌కు విద్యుత్‌ షాక్‌.. దుర్మరణం

  • అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌ ఆదేశం

  • నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు: వాతావరణ కేంద్రం

  • 30 జిల్లాల్లో కురిసిన వర్షం.. రంగారెడ్డి జిల్లా కేశంపేటలో అత్యధికంగా 9.7 సెం.మీ

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జోరు వాన కురిసింది. 30 జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 621 మండలాలు ఉండగా.. 435 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఖమ్మం, కొత్తగూడెం, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌, హైదరాబాద్‌ జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. రంగారెడ్డి జిల్లా కేశంపేటలో అత్యధికంగా 9.7 సెంటీమీటర్లు, సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో 9.1, నాగర్‌ కర్నూల్‌ జిల్లా ఉప్పునూతలలో 8.5, వనపర్తి జిల్లాజానంపేటలో 7.7, జగిత్యాల జిల్లా వెల్గటూరులో 7.9,మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌లో 7.8, రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో 7.7 నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొడైర్‌, వికారాబాద్‌ జిల్లా బొమ్మరా్‌సపేటలో 7.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వర్షాలు దంచికొట్టాయి. షాబాద్‌ మండలం తాళ్లపల్లిలో 9, రాజేంద్రనగర్‌లో 8, వికారాబాద్‌ జిల్లా బొమ్మరాశిపేటలో 7 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. శంషాబాద్‌లో జాతీయ రహదారిపై వర్షపునీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. తక్కువ విజిబిలిటీ కారణంగా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన విమానాలను దారి మళ్లించారు. హైదరాబాద్‌లో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఖైరతాబాద్‌లోని మింట్‌కాంపౌండ్‌ మార్గంలో భారీ వృక్షం నేలకూలగా.. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రాజేంద్రనగర్‌, రామచంద్రాపురం, లింగంపల్లి, గచ్చిబౌలి, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, ఎర్రగడ్డ, మోహిదీపట్నం ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ నెలకొంది. ఆనంద్‌నగర్‌, బోయినపల్లి ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. మీర్‌పేట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఇంటిపై తాటిచెట్టు పడడంతో వృద్ధురాలు లక్ష్మీ సేవ్యా(75) మృతి చెందారు. భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో గంటకుపైగా భారీ వర్షం కురవగా.. 65వ నంబరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.


బలమైన ఈదురు గాలులకు ఎస్‌.లింగోటం, తాళ్ల సింగారం ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు, చెట్లు కూలిపోయాయి. మునుగోడు పత్తి మిల్లు వద్ద చౌటుప్పల్‌ రోడ్డుపై వరద రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మర్రివాగు వంతెన వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు వరద ప్రవాహానికి తెగిపోయింది. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, ఆందోల్‌, పటాన్‌చెరు తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. సంగారెడ్డి మండలం ఇరిగిపల్లిలో ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఫీజు అమరుస్తుండగా విద్యుదాఘాతానికి గురై అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ మృతి చెందారు. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురంలో వర్షం ధాటికి 25ఎకరాల్లో వేసిన అరటి పంట ధ్వసమైంది. ఇదే మండలంలోని తిమ్మంపేటలో గేదెల షెడ్డు కూలిపోయింది. దీంతో రూ:10లక్షల నష్టం వచ్చినట్లు షెడ్డు యజమాని సంతో్‌షరెడ్డి పేర్కొన్నారు. వర్ధన్నపేట మండలం కోనాపురంలో పలువురి ఇళ్ల పై కప్పులు ఎగిరిపోయాయి. కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చింతిర్యాలగూడేనికి చెందిన పాయం నాగరాజు(31), ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలోని కరంజి(కె) గ్రామానికి చెందిన దుర్ల భూమన్న(69) వడదెబ్బకు గురై మృతి చెందారు. రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

సీఎం సమీక్ష.. హైదరాబాద్‌లో హై అలర్ట్‌

భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ రీజియన్‌లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్మాత్యక ప్రాంతాల్లో ఎమర్జెన్సీ బృందాలను మోహరించాలని సూచించారు. కాగా, రోడ్లు భవనాల శాఖలో సీఈ నుంచి ఏఈ వరకు అన్ని స్థాయిల ఇంజినీర్లు క్షేత్రస్థాయిలోనే ఉండి పరిస్థితులను పర్యవేక్షించాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. రోడ్లు దెబ్బతిన్నా, కోతకు గురైనా తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రజా రవాణాకు అంతరాయం కలగకుండా చూడాలని చెప్పారు. ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి రోడ్లు, వంతెనల పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో వర్షప్రభావిత ప్రాంతాలను డీజీపీ సీవీ ఆనంద్‌ స్వయంగా పరిశీలించారు. టోలిచౌకి పరిధిలోని మల్కంపేట చెరువుతోపాటు పలు ప్రాంతాలను సందర్శించి.. సైబరాబాద్‌ సీపీ రమే్‌షను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Updated Date - Jun 14 , 2026 | 04:47 AM