41.84 లక్షల సర్ నోటీసులకు ముగిసిన విచారణ గడువు
ABN , Publish Date - Sep 25 , 2026 | 02:23 AM
రాష్ట్రంలో సర్ ప్రక్రియలో భాగంగా... తుది ఓటరు జాబితాలో ఓటర్ల పేరును పదిలం చేసుకునేందుకు పలు అభ్యంతరాల నివృత్తి కోసం నోటీసులు జారీ చేస్తున్నారు.
41.84 లక్షల సర్ నోటీసులకు
ముగిసిన విచారణ గడువు
మళ్లీ అవకాశంపై ఓటర్లలో ఆందోళన
రీ షెడ్యూల్‌కు ఎన్నికల అధికారుల కసరత్తు
హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో సర్ ప్రక్రియలో భాగంగా... తుది ఓటరు జాబితాలో ఓటర్ల పేరును పదిలం చేసుకునేందుకు పలు అభ్యంతరాల నివృత్తి కోసం నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 83.24 లక్షల మందికి సర్ నోటీసులు జారీ చేయగా అందులో.. విచారణ గడువు ముగిసినవి 41.84 లక్షలకు పైగా ఉన్నట్లు సమాచారం. ఓటర్లు సకాలంలో స్పందించక పోవడం, విచారణకు హాజరు కాకపోవడం, విచారణకు వెళ్లిన సందర్భంలో రద్దీ ఉండటం... ఓటర్లకు ఎన్నికల విభాగాలు తగిన ఏర్పాట్లు చేయకపోవడం వంటి కారణాలతో.. సగం మందికి పైగా విచారణ పూర్తి కాలేదు. నిర్ణీత తేదీల్లో విచారణకు హాజరు కాని 41.84 లక్షల మందికి మరోసారి అవకాశం కల్పిస్తారా..? లేదంటే తాము శాశ్వతంగా ఓటు హక్కు కోల్పోతామా అని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా గడువు ముగిసిన నోటీసుల్లో అత్యధికంగా జిల్లాల వారీగా మేడ్చల్-మల్కాజ్‌గిరిలో 7.98 లక్షలు, ఆ తర్వాతి స్థానాల్లో రంగారెడ్డి 5.88, హైదరాబాద్ 4.93, సంగారెడ్డి 2.10, వికారాబాద్ 1.53 లక్షలు ఉన్నాయి. అయితే ఇంకా జారీచేయాల్సిన నోటీసుల సంఖ్య 9.64 లక్షలు ఉంది. అయితే ఈఆర్‌ఓలు జారీచేసిన నోటీసులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 46.25 లక్షల మంది ఓటర్లతో విచారణ, రుజువు పత్రాల సేకరణ ప్రక్రియ పూర్తయింది. 56,400 మందికి విచారణ తేదీ రీ షెడ్యూల్ చేశారు. ఇప్పటి వరకు 3వేల మంది ఓటర్లను ఎన్నికల అధికారులు అనర్హులుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కాగా విచారణకు గడువు ముగిసిన 41.84 లక్షల నోటీసులను రీషెడ్యూల్ చేయడంపై ఎన్నికల అధికారులు కసరత్తు చేస్తున్నారు. నోటీసులు అందకపోవడం, ఓటర్ల వద్ద అవసరమైన పత్రాలు లేకపోవడం వంటి కారణాలవల్ల స్పందన తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, అర్హులందరి పేర్లు తుది ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక దృష్టి నిలుపుతున్నామని అధికారులు పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్దేశిత గడువులోగా స్పందించి, అవసరమైన పత్రాలతో ఈఆర్‌ఓలు/ఏఈఆర్‌ఓల ఎదుట హాజరుకావాలని ఎన్నికలవిభాగాలు విజ్ఞప్తి చేశాయి.
సర్‌పై ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ 28న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు: మహేష్‌గౌడ్
సర్ ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ఈ నెల 28న అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షగౌడ్ పిలుపునిచ్చారు. ఇందుకు ప్రజాస్వామ్య వాదులు, సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరారు. సర్ ప్రక్రియకు సంబంధించి కమిషనర్లు సుఖ్‌బీర్‌సింగ్ సంధు, వివేక్ జోషి వ్యక్తం చేసిన అభ్యంతరాలపై కేంద్ర ఎన్నికలకమిషన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు మొదటి నుంచి పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించడానికి కారణాలేంటి.. ఎన్ని పేర్లు తిరిగి చేర్చారు.. వంటి వివరాలను రాష్ట్రాలు, నియోజకవర్గాల వారీగా ఈసీ బహిర్గతం చేయాలన్నారు. కాంగ్రెస్ మొదటి నుంచి ఎన్నికల సంఘం చర్యలను సందేహిస్తోందని, ఇప్పుడు ఇద్దరు కమిషనర్లు కూడా అవే అనుమానాలు వ్యక్తం చేశారని అన్నారు. కేంద్రంలోని అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేలా ఎన్నికల కమిషన్ వ్యవహరించిందన్న ఆందోళనలకు ఇది బలం చేకూరుస్తోందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి