Share News

గాంధీ చరిత్రను వక్రీకరిస్తూ గాడ్సేను స్మరిస్తున్నారు

ABN , Publish Date - Oct 03 , 2026 | 05:35 AM

మహాత్మా గాంధీ చరిత్రను వక్రీకరిస్తూ గాడ్సేను స్మరించుకునే దౌర్భాగ్య పరిస్థితులు నేడు దేశంలో దాపురించాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

గాంధీ చరిత్రను వక్రీకరిస్తూ గాడ్సేను స్మరిస్తున్నారు
BHAPUGHATU

  • అలాంటి దేశద్రోహులకు

దూరంగా ఉండాలి: డిప్యూటీ సీఎం భట్టి

  • ఎల్బీస్టేడియంలో గాంధీ జయంతి వేడుకలు

  • బాపూఘాట్‌లో గవర్నర్‌, సీఎం నివాళులు

బర్కత్‌పుర/కార్వాన్‌/హైదరాబాద్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): మహాత్మా గాంధీ చరిత్రను వక్రీకరిస్తూ గాడ్సేను స్మరించుకునే దౌర్భాగ్య పరిస్థితులు నేడు దేశంలో దాపురించాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గాంధీజీని విమర్శించే వారు దేశద్రోహులని.. వారికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అసమానతలు, అవమానాలు లేని సమాజాన్ని నిర్మించుకోవడమే జాతిపిత గాంధీజీకి ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పారు. శుక్రవారం ఎల్బీస్టేడియంలో టీపీసీసీ, గాంధీ జ్ఞాన ప్రతిష్ఠ సంయుక్త ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూ బాట పేరుతో 1,157 చరకాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భట్టి మాట్లాడుతూ.. గాంధీజీ భారత్‌లో పుట్టడం మన అదృష్టంగా భావించాలని, ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లడమే మన లక్ష్యమని చెప్పారు. గాంధీజీ గురించి పూర్తిగా తెలియని వారు ఆయన చరిత్రను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ.. గాంధీయిజమే భారత్‌కు శ్రీరామరక్ష అని వ్యాఖ్యానించారు. గాంధీ జయంతి ప్రపంచానికి ఒక పండుగలాంటిదని, శాంతిని కోరుకునే ప్రపంచ ప్రజలంతా గాంధీజీని చూసి గర్వపడుతున్నారన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకటస్వామి మాట్లాడుతూ.. గాంధీజీ జీవిత చరిత్రను ప్రతి విద్యార్థికి తెలియజేయాలని సూచించారు. ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు మాట్లాడుతూ.. గాంధీజీ బాటలో నడిచి జాతీయ జెండాను రూపకల్పన చేసిన పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమానికి మంత్రి అజారుద్దీన్‌, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి, గాంధీ జ్ఞానప్రతిష్ఠ అధినేత గున్నా రాజేందర్‌రెడ్డి హాజరవ్వగా.. దాదాపు 10 వేల మంది విద్యార్థులు వేడుకల్లో పాల్గొన్నారు.


బాపూఘాట్‌లో గాంధీ జయంతి వేడుకలు..

గాంధీ జయంతి సందర్భంగా లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గాంధీజీ స్మారక చిహ్నం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌, మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2026 | 05:37 AM