రోడ్డు ప్రమాదాన్ని దాచేందుకు స్నేహితుడిని చంపేశాడు
ABN , Publish Date - Jul 29 , 2026 | 08:23 AM
మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ యువకుడు... తనతోపాటు ద్విచక్రవాహనంపై వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన తన స్నేహితుడిని చంపేశాడు. మెరుగైన చికిత్స అందించేందుకు తీసుకెళితే రోడ్డు ప్రమాదం విషయం బయటకు వస్తుందనే భయంతో..
నిర్మల్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
నర్సాపూర్(జి) (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ యువకుడు... తనతోపాటు ద్విచక్రవాహనంపై వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన తన స్నేహితుడిని చంపేశాడు. మెరుగైన చికిత్స అందించేందుకు తీసుకెళితే రోడ్డు ప్రమాదం విషయం బయటకు వస్తుందనే భయంతో స్నేహితుడి ఉసురు తీసేశాడు. నిర్మల్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటనలో పంచగూడ సాయితేజ(26) తన స్నేహితుడు రాయరం రాజశేఖర్ చేతిలో హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన పంచగూడ సాయితేజ(26) జూలై 16న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో సాయితేజ తల్లి ఆ మరుసటి రోజు నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే, నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వేంపల్లి శివారులోని ఎస్సారెస్పీ కాలువ ఒడ్డున జూలై 20న సాయితేజ మృతదేహం లభ్యమైంది. దీంతో కేసును అనుమానాస్పద మృతిగా మార్చిన పోలీసులు.. మొబైల్ కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేశారు. సాయితేజ చివరిగా దర్యాపూర్‌కు చెందిన రాయరం రాజశేఖర్‌తో కలిసి వెళ్లినట్లు గుర్తించారు.
రాజశేఖర్‌ను విచారించగా సాయితేజను తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. తన బైక్ సర్వీసింగ్ కోసం రాజశేఖర్ ఈ నెల 16న తన స్నేహితుడు సాయితేజను వెంట తీసుకెళ్లాడు. మార్గమధ్యలో ఇద్దరూ మద్యం సేవించారు. మద్యం మత్తులో ద్విచక్రవాహనంపై వస్తుండగా గంజాల్ టోల్‌ప్లాజా దాటిన తర్వాత రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టగా.. సాయితేజకు తీవ్ర గాయాలయ్యాయి. నిర్మల్‌లోని ఆస్పత్రుల్లో సాయి తేజకు ప్రథమ చికిత్స అందించగా.. మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ లేదా నిజామాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో ప్రమాదం విషయం పోలీసులకు చెబుతానని సాయి తేజ అనడంతో జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనని రాజశేఖర్ భయపడ్డాడు. సాయితేజను వేంపల్లి శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బండరాయితో మోది హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కాలువ ఒడ్డున పడేసి పరారయ్యాడు. కానీ రాజశేఖర్ చివరికి హత్య కేసులో కటకటాలపాలయ్యాడు.