Share News

అప్పు తీర్చేందుకు పక్కింటి మహిళ నగలు చోరీ

ABN , Publish Date - Nov 13 , 2026 | 04:26 AM

స్టాక్‌మార్కెట్‌లో భారీగా నష్టపోయిన ఒక మాజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ దొరికిన చోటల్లా అప్పులు చేశాడు.

అప్పు తీర్చేందుకు పక్కింటి మహిళ నగలు చోరీ
anitha

  • ఆమె గుర్తు పట్టడంతో హత్య.. మీర్‌పేట్‌లో దారుణం

సరూర్‌నగర్‌, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): స్టాక్‌మార్కెట్‌లో భారీగా నష్టపోయిన ఒక మాజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ దొరికిన చోటల్లా అప్పులు చేశాడు.. ఆ అప్పులు తీర్చడానికి తాను నివసించే భవనంలోనే ఉండే ఒక మహిళ మెడలోని బంగారు నగలు అపహరించాలని పథకం వేశాడు.. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన అతడిని ఆ మహిళ గుర్తు పట్టడంతో.. తనగుట్టు రట్టవుతుందని భావించి ఆమెను దారుణంగా హత్యచేసి నగలు చోరీచేశాడు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లోని మీర్‌పేట్‌లో జరిగిన దారుణంపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశారు. గురువారం ఆదిభట్ల ఏసీపీ ప్రదీ్‌పకుమార్‌రెడ్డి ఈ కేసు వివరాలను వెల్లడించారు. తమిళనాడులోని కాంచీపురానికి చెందిన అరుణ్‌కుమార్‌.. భార్య అనిత(34), ఇద్దరు పిల్లలతో కలిసి జిల్లెలగూడ సమీపంలోని ధాతునగర్‌లో ఉన్న శ్రీలక్ష్మి అపార్ట్‌మెంట్‌ లో అద్దెకు ఉంటున్నారు. అదే బ్లాకులోని నాలుగో అంతస్తులో నివసించే గద్ద రాజ్‌కుమార్‌(41) గతంలో ఓ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి రూ.4కోట్లదాకా నష్టపోయి భారీగా అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు కింది అంతస్తులో ఉంటున్న అనిత వద్ద ఉన్న నగలు కొట్టేయాలని పథకం వేసి.. తలకు హెల్మెట్‌ పెట్టుకొని చోరీకి ప్రయత్నించాడు. అనిత అతడిని గుర్తించి గట్టిగా అరవటంతో పక్కనే ఉన్న ఇస్త్రీ పెట్టెతో దాడిచేసి చంపేశాడు. నగలను ఒక చోట దాచిపెట్టి ఎప్పటిలాగే ఇంటికి వచ్చాడు. అనిత పిల్లలు సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి తల్లి రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న మీర్‌పేట్‌ పోలీసులు రాజ్‌కుమార్‌ను అనుమానించి గట్టిగా నిలదీయడంతో నేరం ఒప్పుకున్నాడు

Updated Date - Nov 13 , 2026 | 04:26 AM