Share News

పంట రక్షణ తీగలే.. యమపాశాలై.. !

ABN , Publish Date - Oct 03 , 2026 | 05:22 AM

ఎన్నో కష్టనష్టాలు ఓర్చి సాగు చేసుకున్న పంటను జంతువుల బారి నుంచి రక్షించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న విద్యుత్‌ తీగలే ఆ రైతు దంపతుల పట్ల యమపాశాలయ్యాయి.

పంట రక్షణ తీగలే.. యమపాశాలై.. !
FARMER COUPLE

  • విద్యుత్‌ షాక్‌తో రైతు దంపతుల మృతి8 సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఘటన

గంభీరావుపేట, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ఎన్నో కష్టనష్టాలు ఓర్చి సాగు చేసుకున్న పంటను జంతువుల బారి నుంచి రక్షించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న విద్యుత్‌ తీగలే ఆ రైతు దంపతుల పట్ల యమపాశాలయ్యాయి. పంటను చూసుకోవడానికి వెళ్తుండగా అవి తగిలి విద్యుదాఘాతానికి గురై వారిద్దరూ మృతి చెందారు. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన రైతు గంట దేవయ్య(65), భార్య లక్ష్మి(58) దంపతులు కౌలు వ్యవసాయం చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉండగా, వారికి వివాహాలు అయ్యాయి. ఓ రైతుకు చెందిన ఎకరంన్నర వ్యవసాయ భూమిని దేవయ్య, లక్ష్మిలు కౌలుకు తీసుకుని రెండేళ్ళుగా వరిని సాగు చేస్తున్నారు. కోతులు, పందుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు వీరిద్దరూ విద్యుత్‌ తీగలతో పొలం చుట్టూ కంచెను ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం రోజూలాగే పొలం వద్దకు వెళ్లారు. అయితే, శుక్రవారం ఉదయం వీరిద్దరూ పొలంలో విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందగా సమీప రైతు గమనించి వారి బంధువులకు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Updated Date - Oct 03 , 2026 | 05:26 AM