ఫామ్‌ల్యాండ్ వెంచర్లలో గప్‌చుప్
ABN , Publish Date - Oct 03 , 2026 | 05:45 AM
ఫామ్‌ల్యాండ్ వెంచర్ల పేరిట ప్లాట్లు విక్రయిస్తూ.. అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తుండడంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం చర్చనీయాంశమైంది.
సెలవు రోజైనా కానరాని కస్టమర్ల హడావిడి
వెంచర్లలో తాత్కాలికంగా పనుల నిలిపివేత
ప్లాట్ల విక్రయంపై ఇంటెలిజెన్స్ వర్గాల ఆరా!
సంగారెడ్డి, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఫామ్‌ల్యాండ్ వెంచర్ల పేరిట ప్లాట్లు విక్రయిస్తూ.. అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తుండడంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం చర్చనీయాంశమైంది. తహసీల్దార్ కార్యాలయాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతున్న తీరుపై శుక్రవారం ‘రియల్ వెర్రి’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగల్‌గిద్ద, మనూరు, సిర్గాపూర్, కంగ్టి మండలాల్లోని వేలాది ఎకరాల్లో ఈ ఫామ్‌ల్యాండ్ వెంచర్లను ఏర్పాటు చేయగా.. హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు చెందిన దాదాపు 35 వేల మంది వీటిలో ప్లాట్లు కొనుగోలు చేశారు. కాగా, గుంట, రెండు గుంటల చొప్పున భూమిని తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయడంపై సర్కారు దృష్టి పెట్టినట్లు తెలిసింది. ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా ఆరా తీసినట్లు సమాచారం. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లలో భాగస్వాములైన రెవెన్యూ అధికారుల్లో ఆందోళన మొదలైందన్న చర్చ జరుగుతోంది. మరోవైపు సెలవు దినం వచ్చిందంటే ఫామ్‌ల్యాండ్ వెంచర్లలో కనిపించే హడావిడి శుక్రవారం కనిపించలేదు. గాంధీ జయంతి సందర్భంగా సెలవు ఉన్నప్పటికీ ఒక్క కస్టమర్ కూడా ఈ వెంచర్ల వైపు రాలేదు. ప్రతిరోజూ వెంచర్లలో ప్లాట్లు, రహదారుల ఏర్పాటు, మొక్కల పెంపకం వంటి పనులు చేస్తుండగా.. శుక్రవారం ఆ పనులు కూడా నిలిపివేశారు. అయితే గతంలోనూ ఈ వెంచర్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సందర్భాల్లో ఒకటి రెండు రోజులు ఈ హడావిడి మానేసి.. ఆ తర్వాత షరా మామూలే అన్నట్లుగా వ్యవహరించారని స్థానికులు చెబుతున్నారు. ఎనిమిదేళ్ల క్రితమే ఈ దందా మొదలైనందున.. ఆనాడు శ్రీకారం చుట్టిన వెంచర్లు పిచ్చిమొక్కలతో వెక్కిరిస్తున్నాయి. ప్లాట్లు కొనుగోలు చేసినవారు తమ ప్లాట్లను గుర్తించడం తేలిక కాదంటున్నారు.