‘బోరు’మన్న కుటుంబం!
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:41 AM
ఆ కుటుంబానికి ఆరెకరాల పొలం ఉంది.. 150 గొర్రెలున్నాయి! అయినా రూ.30 లక్షల అప్పు ఉందనే ఆవేదనే ఆ ఇల్లాలిని వేధించసాగింది....
అప్పటికే వారికి రూ.30 లక్షల అప్పు
350 ఫీట్లు తవ్వినా బోరుబావి ఫెయిల్
మరో బోరుబావి తవ్విస్తున్నాడని భర్తతో భార్య గొడవ
ఆపై ముగ్గురు పిల్లలతో కలిసి బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నం
ఆమెతో పాటు ఇద్దరు కూతుళ్ల మృతి.. బయటపడ్డ కుమారుడు
మహబూబ్‌నగర్ జిల్లా వెల్కిచర్లలో విషాదం
భూత్పూర్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ఆ కుటుంబానికి ఆరెకరాల పొలం ఉంది.. 150 గొర్రెలున్నాయి! అయినా రూ.30 లక్షల అప్పు ఉందనే ఆవేదనే ఆ ఇల్లాలిని వేధించసాగింది. ఈ క్రమంలో సాగునీటి కోసం పొలంలో 350 ఫీట్ల మేర బోరుబావి తవ్వించినా చుక్కనీరు రాకపోవడంతో తీవ్రంగా కలతచెందింది. అయితే తాను వద్దన్నా వినిపించుకోకుండా భర్త, మరో బోరుబావి తవ్విస్తుండటంతో అతడితో ఆమె గొడవ పడింది. తన మాట వినిపించుకోవడం లేదనే కోపంతో ముగ్గురు పిల్లలతో కలిసి వ్యవసాయ బావిలో దూకింది. ఈ ఘటనలో ఆమె, ఇద్దరు పిల్లలు మృతిచెందారు. ఓ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ వెల్కిచర్ల గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. ఇటీవలే ఇంటికి మరమ్మతులు చేయించి.. కొత్త రంగులు వేయించి, రెండ్రోజుల్లో సత్యనారాయణ వ్రతం చేయించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా ఈ ఘటన జరగడం బంధువులను, గ్రామస్థులను తీవ్రంగా కలిచివేసింది. గ్రామానికి చెందిన కుర్వకత్తె బీరయ్య గొర్రెల కాపరి. వ్యవసాయం కూడా చేస్తున్నాడు. ఆయనకు భార్య జంగమ్మ (35), కూతుళ్లు జ్యోతి (14), శైలజ (11), కుమారుడు జశ్వంత్ (7) ఉన్నారు. భార్యాభర్తల మధ్య బోరుబావి తవ్వకం విషయంలోనే గొడవ జరిగింది. బుధవారం సాయంత్రం బీరయ్య తన పొలంలో 350 ఫీట్ల మేర బోరు తవ్వించినా చుక్క నీరు కూడా రాలేదు. గురువారం తెల్లవారుజామున మరో బోరుబావి తవ్వకాన్ని ప్రారంభించాడు. అయితే ఇప్పటికే రూ. 30 లక్షలకు పైగా అప్పుల్లో ఉన్నామని, మరో బోరుబావి తవ్వకం తగదని అతడిని జంగమ్మ వారించింది. అయినా బీరయ్య వినిపించుకోలేదు. ఉదయం 9 గంటల కు అమిస్తాపూర్‌లోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జ్యోతి, అక్కడే 5వ తరగతి చదువుతున్న శైలజ, స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న జశ్వంత్‌ను తల్లి జంగమ్మ ఇంటికి తీసుకొచ్చింది. వారిని వెంటబెట్టుకొని సొంత వ్యవసాయ పొలం పక్కనే ఉన్న దాయాదుల బావిలో దూకింది. కుమారుడు జశ్వంత్ ఆ బావి గోడకు అంచులో ఒక కర్ర కనిపించడంతో దాన్ని పట్టుకొని బయటపడ్డాడు. ఆ తర్వాత గ్రామంలోకి పరుగెత్తుకెళ్లి జరిగిన ఘటన గురించి పొరుగింటివారితో చెప్పాడు. గ్రామస్థులు హుటాహుటిన వెళ్లి రెండు గంటల పాటు బావిలోని నీటిని తోడారు. అప్పటికే జంగమ్మ, జ్యోతి, శైలజ మృతిచెందారు. మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.