విద్యుత్తు సంస్థల విభజన, ప్రైవేటీకరణ వద్దు
ABN , Publish Date - Jun 13 , 2026 | 06:51 AM
విద్యుత్తు సంస్థల విభజన, ప్రైవేటీకరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అఖిల భారత విద్యుత్తు ఇంజనీర్ల సమాఖ్య (ఏఐపీఈఎఫ్) తీవ్రంగా ఖండించింది...
అఖిల భారత విద్యుత్ ఇంజనీర్ల సమాఖ్య
హైదరాబాద్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు సంస్థల విభజన, ప్రైవేటీకరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అఖిల భారత విద్యుత్తు ఇంజనీర్ల సమాఖ్య (ఏఐపీఈఎఫ్) తీవ్రంగా ఖండించింది. శుక్రవారం బెంగళూరులో సమాఖ్య చైర్మన్ శైలేంద్ర దూబే అధ్యక్షతన ఫెడరల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. దీనికి ప్రధాన కార్యదర్శి పి.రత్నాకర్‌రావు, కర్ణాటక ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు బసవన్న, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ దేశాయ్‌తో పాటు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పలు తీర్మానాలు చేశారు. ఈ మేరకు ప్రతిపాదిత విద్యుత్తు సవరణ బిల్లు-2025ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకే ప్రాంతంలో మల్టీ లైసెన్స్‌ను ఈ బిల్లు అనుమతిస్తుందని, విద్యుత్తు పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరించడమే ఈ బిల్లు ఉద్దేశమని ఆక్షేపించారు. ప్రభుత్వ డిస్కమ్‌లను బలహీనపరిస్తే క్రాస్ సబ్సిడీ సర్‌చార్జ్ విధానం రద్దవుతుందని, అదే జరిగితే సాధారణ వినియోగదారులు, రైతులపై విద్యుత్తు చార్జీల భారం పెరుగుతుందని గుర్తు చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు పెడితే.. దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా తదితర రాష్ట్రాల్లో ప్రత్యేకంగా వ్యవసాయ డిస్కమ్‌ల ఏర్పాటు ప్రతిపాదనలను వ్యతిరేకించారు. ఏపీలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు డీమ్డ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ ఇవ్వాలనే ప్రతిపాదన సరికాదన్నారు. లద్దాఖ్ పవర్ డెవల్‌పమెంట్ డిపార్ట్‌మెంట్‌ను జాయింట్ వెంచర్‌గా మార్చాలనే నిర్ణయాన్ని తప్పుపట్టారు. యూపీలో పూర్వాంచల్, దక్షిణాంచల్ విద్యుత్ వితరణ్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. దేశవ్యాప్తంగా విద్యుత్తు రంగ ఉద్యోగులు/ఇంజనీర్లకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
అమేథీ పంచాయతీ ఓటర్ల జాబితా నుండి స్మృతి ఇరానీ పేరు గల్లంతు
మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న రైలుపై దాడి.. ఇద్దరి అరెస్టు