ఆదుకుంటారని ఆస్తి రాసిస్తే.. అమ్మను గెంటేశారు
ABN , Publish Date - Sep 17 , 2026 | 05:47 AM
అవసాన దశలో ఆదుకుంటారని తన ఆస్తినంతా ఇద్దరు కూతుళ్ల పేరిట రాసిన ఓ తల్లిని ఆ కూతుళ్లు కర్కశంగా రోడ్డున పడేశారు. హైదరాబాద్‌లోని కుషాయిగూడ నాగార్జున నగర్‌కు చెందిన కందాడి ధర్మారెడ్డికి భార్య వెంకటమ్మ, ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు సంతానం
కుషాయిగూడలో ఇద్దరు కూతుళ్ల నిర్వాకం..
వారం రోజులుగా
రోడ్డుపైనే అల్లాడుతున్న వృద్ధురాలు
కుషాయిగూడ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): అవసాన దశలో ఆదుకుంటారని తన ఆస్తినంతా ఇద్దరు కూతుళ్ల పేరిట రాసిన ఓ తల్లిని ఆ కూతుళ్లు కర్కశంగా రోడ్డున పడేశారు. హైదరాబాద్‌లోని కుషాయిగూడ నాగార్జున నగర్‌కు చెందిన కందాడి ధర్మారెడ్డికి భార్య వెంకటమ్మ, ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు సంతానం. కీసర తహసీల్దార్ నాగరాజు అక్రమ భూ దందా కేసులో ధర్మారెడ్డి పేరు పదేళ్ల క్రితం ప్రముఖంగా వినిపించింది. ఆ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన ధర్మారెడ్డి.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరేళ్ల క్రితం హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చిన ఆయన కుమారుడు కందాడి శ్రీకాంత్‌రెడ్డి కూడా హత్యకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో వెంకటమ్మ (68) తన ఆస్తి శ్రీకాంత్‌రెడ్డి భార్య (కోడలు), కూతుళ్ల (మనవరాళ్లు)కు దక్కకుండా చేసేందుకు తన ఇద్దరు కూతుళ్ల పేరిట రిజిస్టర్ చేసింది. అయితే, కూతుళ్లు ఇద్దరు ఇంటి అద్దె కోసం గొడవపడి వారం క్రితం వెంకటమ్మను ఇంటి నుంచి గెంటేశారు. దీంతో అప్పటి నుంచి ఆమె రోదిస్తూ ఇంటి బయటే ఉంటోంది. న్యాయం చేయాలని కోరుతూ బుధవారం హెల్ప్‌లైన్ నెం.112 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంకటమ్మ ఫిర్యాదుపై విచారణ కొనసాగిస్తున్నామని.. పూర్వాపరాలు పరిశీలించి కేసు నమోదుచేస్తామని కుషాయిగూడ పోలీసులు తెలిపారు.