Share News

ఎల్‌నినో ఎఫెక్ట్: ఖరీఫ్ సాగుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 03 , 2026 | 09:22 PM

ఖరీఫ్ సాగుపై ఎల్‌నినో నీడలు ముసురుకుంటున్న వేళ.. రాష్ట్ర రైతాంగం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఎల్‌నినో ఎఫెక్ట్: ఖరీఫ్ సాగుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Telangana weathe

హైదరాబాద్, జులై 3: ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల ఖరీఫ్ సాగుపై రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో గడిచిన జూన్‌లో సాధారణం కంటే 40 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, దీనికి ఎల్‌నినో ప్రభావమే ప్రధాన కారణమని ఆయన వివరించారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే జూన్‌లో 22 శాతం వర్షపాతం లోటు ఏర్పడిందని, పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి ఉండటం వల్ల గోదావరి జలాల ప్రవాహం ఈసారి భారీగా ఆలస్యమయ్యే ప్రమాదం పొంచి ఉందని మంత్రి స్పష్టం చేశారు.


ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి రైతులు సాంప్రదాయ పంటల కంటే తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు దృష్టి సారించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ప్రస్తుతానికి రాష్ట్రంలోని రిజర్వాయర్లలో ఉన్న నీటిని అత్యంత సమర్థంగా, పొదుపుగా వినియోగించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు వర్షపాత వివరాలను, జలాశయాల్లోని నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తోందని, అయితే అన్నింటికంటే ముందుగా తాగునీటి అవసరాలకే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎల్‌నినో సృష్టించిన ఈ ప్రకృతి సవాళ్లను సరైన ప్రణాళిక, క్రమశిక్షణతో కూడిన నీటి పొదుపు చర్యలతోనే అధిగమించగలమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

IRCTC అదిరిపోయే టూర్ ప్యాకేజీ..ఒకే ట్రిప్‌లో 6 ప్రముఖ పుణ్యక్షేత్రాలు..

'మతపరమైన ఆచారాల ముసుగులో క్రిమినల్ నేరాలను సమర్థించలేం'

Updated Date - Jul 03 , 2026 | 09:36 PM