కరువు పీడిత రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ
ABN , Publish Date - Sep 30 , 2026 | 04:45 AM
ఎల్‌నినో ప్రభావం వల్ల తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సాగుకు ఎల్‌నినో సెగ
తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా
కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: ఎల్‌నినో ప్రభావం వల్ల తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. అదే సమయంలో వర్షాలు, వరదల వల్ల పంట నష్టం సంభవించిందని వెల్లడించారు. అయినప్పటికీ 2026-27 ఖరీఫ్‌లో పంటల దిగుబడి పెద్దగా తగ్గదని తెలిపారు. రబీ సీజన్ సన్నద్ధతపై న్యూఢిల్లీ వేదికగా జరిగిన రెండ్రోజుల జాతీయ సదస్సు అనంతరం చౌహాన్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావం, కరువు, వరదలు వంటివి 2026-27(జూలై- జూన్) ఖరీఫ్ సీజన్‌లో ఆహార ధాన్యాల దిగుబడిపై పెద్దగా ఎలాంటి ప్రభావం చూపించలేదని తెలిపారు. కేంద్రం వద్ద కరువు పీడిత రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీప్రస్తుతమున్న సమాచారం మేరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, ఏపీలోని రాయలసీమలోని కొన్ని ప్రాంతాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయు నివేదికలు ఆయా రాష్ట్రాల నుంచి రావాల్సి ఉందన్నారు. వర్షాలు, వరదల వల్ల మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ సీజన్‌లో 6.11 లక్షల హెక్టార్ల మేర పంట నష్టం సంభవించినట్లు అంచనాలు ఉన్నాయన్నారు. కర్ణాటక ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ బృందం అక్టోబరు 3న ఆ రాష్ట్రంలో పర్యటించనుందని, ప్రస్తుత పరిస్థితులను అంచనా వేస్తోందని చౌహాన్ తెలిపారు. మహారాష్ట్ర సీఎం కూడా విజ్ఞప్తి చేశారని, కేంద్ర బృందం త్వరలో మహారాష్ట్రకు కూడా వెళుతుందని చెప్పారు. కరువు ప్రభావిత రాష్ట్రాల్లో త్వరలో తానే స్వయంగా పర్యటిస్తానని చౌహాన్ ఈ సందర్భంగా వెల్లడించారు.
ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల సమన్వయంతో పని చేస్తామని, సాగు భూములు బీడుబారి పోకుండా చూసుకోవడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఇక, రబీ పంటల సీజన్‌లో తక్కువ నీటితో సాగు చేసి, తక్కువ సమయంలో పంట చేతికొచ్చే.. పంటల రకాలు, విత్తనాల ఎంపిక అంశంలో కేంద్రం రాష్ట్రాలకు సాయం చేస్తుందని చెప్పారు. కరువు పరిస్థితుల వల్ల వ్యవసాయానికి ఇబ్బంది కలుగకుండా రైతులకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. కాగా, భారత ప్రభుత్వం వివిధ దేశాలతో చేసుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు(ఎఫ్ టీఏ)లపై రైతులకు స్పష్టమైన సమాచారం అందిస్తామని చౌహాన్ చెప్పారు. ఎఫ్‌టీఏలో ఉన్న పంట ఉత్పత్తులు, వాటి నాణ్యత, మార్కెటింగ్ అవకాశాలపై రైతులకు అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.