రూ.16కోట్ల ఇంజెక్షన్ ఉంటేనే ఆ ‘చైత్రిక’ బతుకుతుంది!
ABN , Publish Date - Jun 10 , 2026 | 05:11 AM
పుట్టిన నాలుగు నెలలకే ఆ పసికందును భయంకరమైన జన్యు వాధి చుట్టుముట్టింది. ‘‘మీ పాప బతకాలంటే ఇంజెక్షన్ చేయాలి.
8 నెలల పసికందును వేధిస్తున్న అరుదైన జన్యువ్యాధి
రెండేళ్లలోపు ఇంజెక్షన్ ఇస్తేనే ప్రాణాపాయం నుంచి విముక్తి: నిమ్స్ వైద్యులు
ఆదుకోవాలంటూ వేడుకోలు
హైదరాబాద్, జూన్ 9(ఆంధ్రజ్యోతి): పుట్టిన నాలుగు నెలలకే ఆ పసికందును భయంకరమైన జన్యు వాధి చుట్టుముట్టింది. ‘‘మీ పాప బతకాలంటే ఇంజెక్షన్ చేయాలి. దాని ఖరీదు 16కోట్ల రూపాయలు’’ అంటూ డాక్టర్ల నోటి నుంచి ఆ మాట వినగానే కన్నవాళ్ల గుండెలు ఆగినంత పనైంది. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబం.. ఇప్పుడు దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. వనపర్తి జిల్లా మదనాపురం మండలం నెల్విడికి చెందిన ఆటో డ్రైవర్ బేరి రమేశ్ కూతురు చైత్రిక ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్‌ఎంఏ) టైప్-1’ అనే ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. కండరాలు పూర్తిగా బలహీనపడి, ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారే ఈ వ్యాధి నుంచి చిన్నారి ప్రాణాలు కాపాడాలంటే.. రెండేళ్ల వయస్సులోపే ‘ఒనాసెమ్మోజీన్ అబెపార్వోవెక్’ అనే ఇంజెక్షన్ వేయాలని వైద్యులు స్పష్టం చేశారు. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో దాని ధర అక్షరాలా రూ.16 కోట్లు ఉండటం ఆ కుటుంబానికి ఆకాశమంత భారంగా మారింది. పాప ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ కుటుంబం ఇప్పటికే రూ. 5లక్షల వరకు అప్పులు చేసి ఖర్చు చేసింది. దాతలు, ప్రభుత్వం స్పందించి ఆర్థికసాయం అందిస్తే తన బిడ్డకు పునర్జన్మ లభిస్తుందని తండ్రి రమేశ్ కన్నీటి పర్యంతమవుతున్నారు. సహాయం చేయాలనుకునే వారు నేరుగా 89858 01524, 95532 67573 మొబైల్ నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.