500 కిలోల గంజాయి.. 80 కి.మీ చేజింగ్
ABN , Publish Date - Jun 19 , 2026 | 03:14 AM
ఒడిసా నుంచి తెలంగాణకు గంజాయి రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో అంతరాష్ట్ర స్మగ్లర్ల ముఠాను ఈగల్ బృందం వెంటాడింది
అర్ధరాత్రి గంజాయి వాహనాన్ని వెంటాడిన ఈగల్ ఫోర్స్
వాహనంతో పాటు రూ.2.5 కోట్ల గంజాయి స్వాధీనం
8 ఒడిసాలో ఈగల్ ఫోర్స్ సాహసం
హైదరాబాద్/శంషాబాద్ రూరల్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): ఒడిసా నుంచి తెలంగాణకు గంజాయి రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో అంతరాష్ట్ర స్మగ్లర్ల ముఠాను ఈగల్ బృందం వెంటాడింది. ఒడిసాలో బలిమెల ప్రాంతం నుంచి స్మగ్లర్లు బొలెరో వాహనంలో బుధవారం అర్ధరాత్రి గంజాయిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఈగల్ బృందం అడవి మార్గంలో ఆ వాహనాన్ని వెంబడించింది. 80 కిలోమీటర్ల వరకు వెళ్లిన వాహన డ్రైవర్.. పోలీసులు వెంటపడటాన్ని గమనించి.. కోరాపుట్ జిల్లాలోని జయపూర్ వద్ద దట్టమైన అటవీ ప్రాంతంలో వాహనాన్ని ఆపగా.. డ్రైవర్‌తో పాటు స్మగ్లర్లు పారిపోయారు. ఈగల్ పెట్రోలింగ్ టీం ఎస్సై రవిప్రసాద్ బృందం స్మగర్ల వాహనాన్ని చేజింగ్ చేసి పట్టుకుంది. వాహనంలోని రూ.2.5 కోట్ల విలువైన 500కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. వాహన రిజిస్ట్రేషన్ పత్రాల ఆధారంగా ఒడిసాలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన అమీర్ ఖాన్ ఈ వాహన యజమాని అని గుర్తించామని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని, వాహనాన్ని కోరాపుట్ పోలీసులకు అప్పగించామన్నారు. ఈగల్ ఫోర్స్ పోలీసుల సాహసాన్ని ఒడిసా పోలీసు ఉన్నతాధికారులు అభినందించారని తెలిపారు. ఈ గంజాయిని తెలంగాణలోకి తీసుకునిరావడానికి స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నారని తమకు విశ్వసనీయ సమాచారం అందడంతో అంతరాష్ట్ర ఆపరేషన్ చేపట్టామని ఆయన వివరించారు.
హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేత
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గురువారం అధికారులు హైడ్రోపోనిక్ గంజాయిని పట్టుకున్నారు. వియత్నాం వయా బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రయాణికుడి వద్ద 7.118 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు.