ఆ గాలి విషం.. ఆ నీరు విషం
ABN , Publish Date - Jun 06 , 2026 | 04:36 AM
అక్కడ గాలి విషం! నీరు కాలకూట విషం!! ఆ నీరు ఒక్క గుటక తాగినా ప్రాణాంతకమే. ఆ గాలి పది నిమిషాలు పీల్చితే.. ఎన్ని క్యాన్సర్ కారక రసాయనవాయువులు శరీరంలోకి ప్రవేశిస్తాయో తెలియదు...
ఒక్క గుటక నీరు తాగలేం.. 10 నిమిషాలు గాలి పీల్చలేం
కాలుష్య కారక పరిశ్రమలు, డంపింగ్ యార్డులతో..దుండిగల్, గాగిల్లాపూర్‌లో పలు తండాల ప్రజలకు నరకం
వాయు, జల కాలుష్యంతో ప్రజలు ఆస్పత్రులపాలు
గర్భసంచి, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో విలవిల
అక్కడ 370 ఎకరాల్లో రాంకీ సంస్థ వ్యర్థాల శుద్ధి కేంద్రం
నిబంధనలు పాటించట్లేదంటున్న స్థానికులు.. పట్టించుకోని పీసీబీ
(హైదరాబాద్ సిటీ/దుండిగల్- ఆంధ్రజ్యోతి)
అక్కడ గాలి విషం! నీరు కాలకూట విషం!! ఆ నీరు ఒక్క గుటక తాగినా ప్రాణాంతకమే. ఆ గాలి పది నిమిషాలు పీల్చితే.. ఎన్ని క్యాన్సర్ కారక రసాయనవాయువులు శరీరంలోకి ప్రవేశిస్తాయో తెలియదు! అసలు ముఖానికి మాస్కు లేకుండా 10 నిమిషాలు కూడా ఉండలేం. అక్కడ ఒక్క అరగంట గడిపితే.. కళ్లు మండటం మొదలవుతుంది. అలాంటి చోట ఏళ్ల తరబడి ఉండడంతో అక్కడి ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. మహిళలకు నెలసరి వస్తే విపరీతమైన రక్తస్రావం అవుతుంటుంది. డాక్టర్ల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటే గర్భాశయం చుట్టూ కణితులు ఉన్నట్టు పరీక్షల్లో తేలుతుంది. పరిష్కారం ఒక్కటే.. గర్భసంచిని తొలగించడం. ఆ ప్రాంతంలో ఈ సమస్యతో చాలా మంది మహిళలకు 35 ఏళ్లు కూడా నిండకుండానే గర్భసంచిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక.. గుండె జబ్బులతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరేవారు, మూత్రపిండాల వైఫల్యంతో మంచానికే పరిమితం అయ్యేవారు.. డయాలసిస్, కిడ్నీ మార్పిడి చేయాల్సిన స్థితికి చేరుకున్నవారు.. చాలామందే కనిపిస్తారక్కడ! అంతేకాదు.. బోన్ క్యాన్సర్, ఇతర క్యాన్సర్ల బారిన పడి ఇటీవలే ముగ్గురు చనిపోయారు. అలాగే.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరొకరు మరణించారు. హైదరాబాద్ నగర శివార్లలో ఔటర్ రింగురోడ్డును ఆనుకుని ఉన్న దుండిగల్, గాగిల్లాపూర్, గడ్డపోతారం, ఖాజిపల్లి ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పలు తండాలకు చెందిన వేలాది మంది ప్రజల దుస్థితి ఇది! ఆ ప్రాంతంలో ఉన్న వందలాది కాలుష్య కారక పరిశ్రమలు, డంపింగ్ యార్డులు, 370 ఎకరాల్లో విస్తరించి ఉన్న రాంకీ వ్యర్థాల శుద్ధి కేంద్రం వంటివాటి నుంచి వెలువడే విషపుగాలులువారి ప్రాణాలు తీస్తున్నాయి.


సాయంత్రం 6 దాటితే..
రోజూ సాయంత్రం 6 గంటలు అయ్యిందంటే చాలు.. విషపు గాలుల జోరు మరింత పెరుగుతుంది. ఆ గాలులు మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ వీస్తూనే ఉంటాయి. అందుకే.. అక్కడి తండాల ప్రజలు చీకటిపడేవేళకు ఇళ్ల తలుపులు, కిటికీలు అన్నీ మూసేసుకుంటారు. తలుపు, కిటికీలకు ఎక్కడైనా సందులుంటే.. వాటిని కర్టెన్లతో మూసేస్తారు. రాత్రిపూట అత్యవసరమై బయటకు రావాలన్నా భయపడతారు. ఎందుకంటే.. తలుపు తీయగానే ముక్కుపుటాలదిరే దుర్వాసనతో కూడిన విషపు గాలి వీస్తుంటుంది. ఉదయం 6 గంటల తర్వాత ఆ కలుషిత గాలి జోరు తగ్గుతుంది గానీ.. దుర్వాసన మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. దశాబ్దకాలంగా పరిస్థితి నానాటికీ మరీ ఘోరంగా తయారవుతోందని.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నామని దుండిగల్, గాగిల్లాపూర్ తండాలవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యర్థాల శుద్ధితోనూ..
దుండిగల్ కేంద్రంగా 370కిపైగా ఎకరాల్లో ఉన్న విస్తరించి ఉన్న స్థలంలో రాంకీ సంస్థ, దానికి అనుబంధంగా ఉన్న ఆర్‌ఈ సస్టెయినబిలిటీలు కలిసి.. మూడు రకాల వ్యర్థాలను శుద్ధి చేస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనది.. పరిశ్రమల్లో ఉత్పత్తి అయిన రసాయన వ్యర్థాలను శుద్ధి చేయడం. ఈ ప్రక్రియను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అనుమతితో చేపట్టారు. ఇక.. హైదరాబాద్ నగరం నుంచి తెచ్చిన చెత్తాచెదారంతో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతులు తీసుకున్నారు. మూడోది.. ఎలకా్ట్రనిక్ వ్యర్థాలను తీసుకువచ్చి ప్రాసెస్ చేయడం. దీనికి ఆర్‌ఈ సస్టెయినబిలిటీ సంస్థ పీసీబీ నుంచి అనుమతి తీసుకుంది. ఈ మూడింటినీ ఒకే చోట చేస్తుండడంతో ఆ ప్రభావం చుట్టు ప్రక్కల ఉన్న నివాస ప్రాంతాలపై పడుతోంది. వ్యర్థాల శుద్ధికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా, నిబంధనల ప్రకారం అక్కడ శుద్ధి ప్రక్రియ జరగట్లేదని.. దానివల్లే అక్కడి గాలి,నీరు, వాతావరణం పూర్తిగా కాలుష్యమయమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ.. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు ఇటువైపే కన్నెత్తి చూడడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. రాంకీ వ్యర్థాల శుద్ధి కేంద్రంలో ఏం జరుగుతోందో బయటి ప్రపంచానికి తెలియనివ్వడం లేదని, స్థానికులను లోపలికి వెళ్లడానికి అనుమతివ్వరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాంకీ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసే సమయంలో తండాలవాసులకు పూర్తిస్థాయిలో సకల సౌకర్యాలూ కల్పిస్తామని.. ఈ ప్రాంత ప్రజలకు దొమ్మర పోచంపల్లిలోని ప్రభుత్వ స్థలంలో ఇండ్లను నిర్మించి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకూ అతీగతీ లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా తమను పట్టించుకోవాలని.. ఈ ప్రాంతాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
అగమ్యగోచరంగా కుటుంబం పరిస్థితి
పరిశ్రమల నుంచి వచ్చే పొగ పెద్ద సమస్య. మా తండా పక్కనున్న డంపింగ్ యార్డులో రాత్రి పూట మంటలు చెలరేగి బూడిదంతా వచ్చి మా ఇళ్లల్లోని నీటిలో పడడం వల్ల అనారోగ్యాలకు గురవుతున్నాము. పీసీబీ అధికారులు పట్టించుకోవడంలేదు. నాకు నలుగురు పిల్లలు. కూలి చేసి కుటుంబాన్ని పోషించుకునేవాడిని. కిడ్నీలు, లివర్ పాడవడంతో మంచానికే పరిమితం అయ్యాను. ఇప్పుడు నా భార్య, పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
- లక్ష్మణ్ నాయక్, గాగిల్లాపూర్ తండా వాసి

కాలుష్యం వల్ల గర్భస్రావాలూ అవుతున్నాయి
కాలుష్యం కారణంగా నా .రెండు మూత్రపిండాలూ చెడిపోయాయి. దీంతో డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి. నేను, నా భర్త పనికి వెళ్తేగానీ గడవని పరిస్థితి. కానీ, ఇప్పుడు నేను మంచానికే పరిమితమయ్యా. పనిచేసే పరిస్థితిలో లేను. నాతో పాటు మా తండాలో చాలా మందికి ఇదే సమస్య. చాలా మంది మహిళలకు కాలుష్యం వల్ల గర్భస్రావాలు కూడా అవుతున్నాయి. ఇక్కడ కొత్త జంటలకు పిల్లలు పుట్టడం కలగా మారే ప్రమాదం ఉంది.
- లక్ష్మి, దుండిగల్ తండా

5 సంవత్సరాలుగా డయాలసిస్
నేను గతంలో పలు రకాల వ్యాపారాలు చేస్తూ నా కుటుంబంతో సంతోషంగా జీవించేవాడిని. ఈ కాలుష్యం కారణంగా.. నా రెండు కిడ్నీలూ చెడిపోయాయి. ఏడు సంవత్సరాల క్రితం కాళ్లవాపుతో మొదలైన సమస్య బాగా ముదిరింది. కిడ్నీలు విఫలం కావడంతో.. ఐదు సంవత్సరాలుగా వారంలో మూడు రోజులు డయాలసిస్ చేయించుకుంటున్నాను.
- కేతావత్ రాజు నాయక్, దుండిగల్ తండా-2
ప్రభుత్వం ఆదుకోవాలి
ఊపిరితిత్తుల సమస్యతో 4 నెలలుగా మంచానికే పరిమితమయ్యా. ఎన్ని ఆస్పత్రులకు పోయినా తగ్గట్లేదు. వాతావరణ కాలుష్యం వల్లే నాకు ఈ సమస్య వచ్చినట్టు వైద్యులు చెబుతున్నారు. మా తండాలలో రోగాల బారిన పడిన వారిని ప్రభుత్వమే ఆదుకోవాలి
- జగన్ నాయక్, గాగిల్లాపూర్ తండా