Share News

పురుగుల మందు తాగి.. పిల్లలకూ తాగించి..

ABN , Publish Date - Sep 17 , 2026 | 06:30 AM

అందరితోనూ కలివిడిగా ఉండే ఆ రైతు.. ఆర్థికంగా పెద్దగా కష్టాలేమీ లేని కుటుం బం. కానీ ఏ సమస్య వచ్చిందో తెలియదు. ఇద్దరు పిల్లలను తీసుకుని పొలం వద్దకు వెళ్లారు. కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాను తాగి, ఇద్దరు పిల్లలకూ తాగించారు. ఆ రైతు, కూతురు చనిపోగా.. కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పురుగుల మందు తాగి..  పిల్లలకూ తాగించి..
The man

photo2 copy.jpg

  • తండ్రి, కుమార్తె మృతి.. కుమారుడి పరిస్థితి విషమం

  • ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా గండ్రాయిలో ఘటన

  • వారి స్వస్థలం ఖమ్మం జిల్లా అప్పలనర్సింహాపురంలో విషాదం

  • ఆర్థికంగా సమస్యలేమీ లేని కుటుంబం..

  • ఆత్మహత్యకు కారణమేమిటనే చర్చ

నేలకొండపల్లి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): అందరితోనూ కలివిడిగా ఉండే ఆ రైతు.. ఆర్థికంగా పెద్దగా కష్టాలేమీ లేని కుటుం బం. కానీ ఏ సమస్య వచ్చిందో తెలియదు. ఇద్దరు పిల్లలను తీసుకుని పొలం వద్దకు వెళ్లారు. కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాను తాగి, ఇద్దరు పిల్లలకూ తాగించారు. ఆ రైతు, కూతురు చనిపోగా.. కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా గండ్రాయిలో ఈ విషాద ఘటన జరిగింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పలనర్శింహాపురం గ్రామానికి చెందిన పుసులూరి శ్రీనివాసరావు (38)కు స్వగ్రామంలో పదెకరాల పొలం ఉంది. అదే జిల్లాలోని పెదమండవలో పదెకరాలు, రాష్ట్ర సరిహద్దుల పక్కన ఎన్టీఆర్‌ జిల్లా గండ్రాయిలో మరో పదెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఆయనకు భార్య, కూతురు లాస్య (13), కుమారుడు నిఖిల్‌ ఉన్నారు. శ్రీనివాసరావు బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడలో చదువుతున్న కుమార్తె లాస్యను, నేలకొండపల్లి మండలం చెర్వుమాధారంలో ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న కుమారుడు నిఖిల్‌ను బైకుపై తీసుకుని.. గండ్రాయిలో కౌలుకు చేస్తున్న పొలం వద్దకు వెళ్లారు. వెంట తీసుకెళ్లిన పురుగులమందును కూల్‌డ్రింక్‌లో కలిపి తొలుత తాను తాగి, తర్వాత పిల్లలిద్దరికీ ఇచ్చి, తాగించారు. ముగ్గురూ పొలం వద్ద కొట్టుమిట్టాడుతుండగా.. సమీపంలోని రోడ్డుపై వెళుతున్నవారు గమనించి 108 సాయంతో గండ్రాయిలోని ప్రభుత్వ వైద్యశాలకు, అక్కడి నుంచి జగ్గయ్యపేటకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మంకు బయల్దేరారు. శ్రీనివాసరావు మార్గమధ్యలోనే మృతి చెందగా.. లాస్య ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. నిఖిల్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.


ఇంత దారుణానికి కారణమేమిటో?

అందరితో కలిగివిడా ఉండే, ఆర్థిక సమస్యలేమీ లేని శ్రీనివాసరావు ఇంత దారుణానికి ఎందుకు పాల్పడ్డారో అర్థం కావడం లేదని బంధువులు, గ్రామస్తులు పేర్కొంటున్నారు. పైగా పిల్లలకు పురుగుల మందు తాగించడమేమిటోనని చర్చించుకుంటున్నారు. కాగా, ఈ ఘటనపై బుధవారం రాత్రివరకు అటు జగ్గయ్యపేట పోలీసులకుగానీ, ఇటు నేలకొండపల్లి పోలీసులకు గానీ ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిసింది.

Updated Date - Sep 17 , 2026 | 06:30 AM