Share News

ధరణి అక్రమాలపై ప్రత్యేక విచారణ షురూ

ABN , Publish Date - Jul 29 , 2026 | 08:12 AM

ధరణి అక్రమాల నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం (సెట్‌) తొలి సమావేశాన్ని మంగళవారం నిర్వహించింది. ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ చారు సిన్హా నేతృత్వంలో నిర్వహించిన ఈ భేటీలో.. విచారణ బాధ్యతలను అంశాలవారీగా అప్పగించినట్లు తెలిసింది. టెండర్‌ నుంచి డేటా భద్రత వరకు సమగ్ర విచారణ చేయాలని ప్రభుత్వం..

ధరణి అక్రమాలపై ప్రత్యేక విచారణ షురూ

  • చారుసిన్హా నేతృత్వంలో తొలి భేటీ..

  • అంశాలవారీగా పని విభజన

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): ధరణి అక్రమాల నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం (సెట్‌) తొలి సమావేశాన్ని మంగళవారం నిర్వహించింది. ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ చారు సిన్హా నేతృత్వంలో నిర్వహించిన ఈ భేటీలో.. విచారణ బాధ్యతలను అంశాలవారీగా అప్పగించినట్లు తెలిసింది. టెండర్‌ నుంచి డేటా భద్రత వరకు సమగ్ర విచారణ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఏడుగురు సభ్యుల ఈ కమిటీ తొలి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ధరణి పోర్టల్‌ టెండర్లు, కేటాయింపుల్లో అవకతకవలు జరిగాయా లేదా?, కాంట్రాక్టు పొందిన సంస్థ పై ఉన్న అభియోగాలు, కాంట్రాక్టు అమల్లో ఉండగానే విదేశీ సంస్థకు పోర్టల్‌ నిర్వహణ బదిలీ, ధరణిలో వ్యక్తిగత వివరాల గోప్యతకు భంగం కలగడం, పోర్టల్‌ రూపకల్పనలో సాంకేతిక లోపాలు, అనధికారిక లావాదేవీలు, సిస్టమ్‌ లాగిన్లు లేకపోవడం, దరఖాస్తుదారుల ఐపీ అడ్ర్‌సలు నమోదు కాకపోవడం, ప్రభుత్వ ప్రయోజనాలు దెబ్బతీసేలా పోర్టల్‌ దుర్వినియోగం వంటి అంశాలపై సెట్‌ లోతైన విచారణ జరపనుంది. ‘సెట్‌’లోని ఏడుగురు సభ్యులూ ఇకపై, ప్రతి వారం భేటీ అయ్యి, ఆ వారంలో వెలుగులోకి వచ్చిన అంశాలపై చర్చించనున్నారు.

అలాగే, ఆ వారం సేకరించిన వివరాలపై కమిటీ ఛైర్‌పర్సన్‌ చారు సిన్హా అంశాలవారీగా సమీక్ష నిర్వహిస్తారు. విచారణలో అక్రమాలు బయటపడ్డా, ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగినట్లు తేలినా.. సంబంధిత బాధ్యులను ప్రత్యేక దర్యాప్తు సంస్థలకు అప్పగించనున్నారు. ధరణిపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించిన కేరళ ప్రభుత్వ సంస్థ.. 22 వేలకుపైగా అనుమానాస్పద భూలావాదేవీలున్నట్టు తన నివేదికలో పేర్కొంది. సుమారు పదివేల ఎకరాల ప్రభుత్వ భూములు చేతులు మారినట్లు గుర్తించింది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లో ఈ తరహా లావాదేవీలు అత్యధికంగా జరిగినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో నిషేధిత జాబితాల నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తులు, రియల్‌ఎస్టేట్‌ సంస్థలు దక్కించుకున్న భూములకు సంబంధించి సర్వే నంబర్లవారీగా సెట్‌ విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో డీనోటిఫై చేసిన కేసులు, గతంలో ఇదే విషయంపై 22ఏ జాబితాలో పెట్టిన కారణాలు, ఆ తరువాత ఎందుకు తొలగించారు.. తొలగించిన భూములు ఎవరి చేతుల్లోకి వెళ్లాయి తదితర అంశాలన్ని సెట్‌ విచారణలో వెలుగులోకి రానున్నాయి.

Updated Date - Jul 29 , 2026 | 08:12 AM