అభిమాని చెంతకు..
ABN , Publish Date - Jun 18 , 2026 | 03:02 AM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మానవత్వం చాటుకున్నారు. అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన తన అభిమాని పొనుగంటి నిరంజన్(17) కోసం బుధవారం హనుమకొండ వచ్చారు.
హనుమకొండలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్‌కు జనసేనాని పవన్ కల్యాణ్ పరామర్శ
ఆరోగ్య స్థితి చూసి కంటతడి.. వైద్య ఖర్చులకు లక్ష సాయం
నిరంజన్ తల్లిదండ్రులకు క్యాంటీన్, ఇంటి ఏర్పాటుకు హామీ
హనుమకొండ, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మానవత్వం చాటుకున్నారు. అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన తన అభిమాని పొనుగంటి నిరంజన్(17) కోసం బుధవారం హనుమకొండ వచ్చారు. పవన్ కల్యాణ్‌ను ఒక్కసారైనా ప్రత్యక్షంగా కలవాలనే నిరంజన్ ఆకాంక్షను వీడియోల ద్వారా తెలుసుకున్న జనసేనాని ఆ కోరికను నెరవేర్చారు. మంచంపై కదలలేని స్థితిలో ఉన్న నిరంజన్‌ను చూసి చలించిపోయారు. ఆ మంచంపైనే కూర్చొని నిరంజన్ చేతిని ఆప్యాయంగా ముద్దాడిన పవన్ కల్యాణ్.. ‘ఎలా ఉన్నావు?’ అంటూ ఆత్మీయంగా పలకరించారు. ‘ఆరోగ్యం ఎలా ఉంది...? అధైర్యపడకు.. మరింత మంచి చికిత్స అందిస్తే తప్పకుండా కోలుకుంటావు...‘లేచి తిరుగుతావు’ అని ధైర్యం చెప్పి ఉత్సాహపరిచారు. తన వెంట తీసుకొచ్చిన తిరుమల వెంకటేశ్వరస్వామి వారి శేష వస్త్రాన్ని నిరంజన్‌కు కప్పిన పవన్ కల్యాణ్.. స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని కూడా అందజేశారు. అలాగే, నిరంజన్‌కు ప్రేమతో. పవన్‌కల్యాణ్ అని రాసిన గబ్బర్ సింగ్ సినిమా ఫోటో ఫ్రేమ్‌ను బహూకరించారు. ‘ప్రియమైన నిరంజన్....ప్రేమతో.... ఆ దుర్గామాత ఆశీస్సులతో నువ్వు చల్లగా ఉండాలని కోరుకుంటూ..’ అని పవన్ తన స్వదస్తూరితో సందేశం రాసి జనసేన డైరీని కూడా ఇచ్చారు. నిరంజన్ ఆరోగ్యం కోసం భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయిస్తానని తెలిపారు. అన్నట్టుగానే దేవాలయాన్ని సందర్శించి నిరంజన్ పేరు మీద ప్రత్యేక పూజలు చేయించారు.
పవన్ కంటతడి
మాట్లాడలేని స్థితిలో ఉన్న నిరంజన్‌లో పవన్‌కల్యాణ్‌ను ప్రత్యక్షంగా చూడగానే ఎక్కడిలేని ఉత్సాహం కనిపించింది. ఏడేళ్ల వరకు బాగానే ఉన్న నిరంజన్ ఆరోగ్యం.. డ్యూచెస్ మస్కులర్ డిస్ట్రోఫీ (డీఎండీ) అనే జన్యు సంబంధమైన వ్యాధి వల్ల క్రమంగా క్షీణిస్తోందని బాలుడి తల్లి మానస విలపిస్తూ పవన్ కల్యాణ్‌కు పరిస్థితిని వివరించారు. కదలలేని స్థితి నుంచి చివరికి మంచానికే పరిమితమయ్యాడని చెప్పారు. దీంతోభావోద్వేగానికి గురైన పవన్ కంటతడి పెట్టుకున్నాడు. ఇక, పవన్ కల్యాణ్‌ను అనుసరిస్తూ నిరంజన్ చేసిన డ్యాన్స్‌ల వీడియోలను పవన్ కల్యాణ్ ఆసక్తిగా తిలకించారు. నిరంజన్ తనకో కుక్క పిల్ల కావాలని కోరగా కొనిస్తానని మాటిచ్చారు. ఇక, కుటుంబపోషణ కోసం క్యాంటీన్ పెట్టుకోవడానికి తమకు సాయం చేయాలని, సొంతింటిని ఏర్పాటు చేయాలని నిరంజన్ తల్లి మానస కోరగా పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించారు. క్యాంటీన్ ఏర్పాటుకు కావాల్సిన సాయం చేయాలని తన పీఏను ఆదేశించిన పవన్ కల్యాణ్.. సొంతింటిని కూడా ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. నిరంజన్ వైద్య ఖర్చుల కోసం రూ.లక్ష నగదు సాయం చేశారు.
పోటెత్తిన అభిమానులు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి కారులో రోడ్డు మార్గాన హనుమకొండ కేయూ రోడ్డులోని హనుమాన్‌నగర్‌కు చేరుకున్నారు. నిరంజన్ నివసిస్తున్న ఇంటి వద్దకు కారు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో.. ప్రధాన రహదారి నుంచి నిరంజన్ ఇంటి వరకు కాలినడకన వెళ్లారు. బుధవారం ఉదయం 10.38 గంటలకు నిరంజన్ ఇంటికి చేరుకున్న జనసేన అధినేత 11.18 గంటల వరకు దాదాపు 46 నిమిషాలు అక్కడే గడిపారు. అక్కడి నుంచి వరంగల్‌లోని భద్రకాళి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత రెడ్డిపాలెంలోని తన స్నేహితుడు, స్టీల్ ఫ్యాక్టరీ యజమాని మేడిశెట్టి నరేంద్ర ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేశారు. అనంతరం హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. కాగా, తమ అభిమాన సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. పవన్ కల్యాణ్ వెంట జనసేన రాష్ట్ర ఇన్‌చార్జి నేమూరి శంకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రాం, ప్రచార కార్యదర్శి ఆర్‌ఎస్ నాయుడు, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె పృథ్వి, జిల్లా నాయకులు రాజేంద్ర ప్రసాద్, గడ్డం రాకేశ్ తదితరులు ఉన్నారు.