ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. హైకోర్టు సంచలన తీర్పు
ABN , Publish Date - Sep 18 , 2026 | 04:35 PM
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో, కాంగ్రెస్ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది.
కాగా.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి విజయం సాధించిన దానం నాగేందర్.. ఆ తర్వాత 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. అయితే దానం పార్టీ ఫిరాయింపునకు పాల్పడలేదంటూ స్పీకర్ ట్రైబ్యునల్ గతంలో తీర్పు ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మహేశ్వర్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. 10వ షెడ్యూల్ ప్రకారం కాకుండా.. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని హైకోర్టును కోరారు. అలాగే, పార్టీ ఫిరాయింపులపైనా స్పీకర్‌కు పలు ఆధారాలు సమర్పించామని, వాటిని పరిగణలోనికి తీసుకోకుండా.. సరైన ఆధారాలు లేవని స్పీకర్ ట్రైబ్యునల్ మార్చి 11న ఉత్తర్వులు ఇచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఆగస్టు 21న తీర్పును రిజర్వ్ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది. దానం నాగేందర్‌పై అనర్హత వేటుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుతో తదుపరి రాజకీయ, న్యాయ పరిణామాలపై ఆసక్తి నెలకొంది. దానం పార్టీ మారడం, కాంగ్రెస్ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం వంటి అంశాలను పిటిషనర్లు తమ వాదనల్లో ప్రధానంగా ప్రస్తావించారు. 2024లోనే దానం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలంటూ న్యాయపరమైన ప్రక్రియ ప్రారంభమైంది. అనంతరం స్పీకర్ ట్రైబ్యునల్ నిర్ణయం, దానిపై హైకోర్టు విచారణ వరకు వ్యవహారం సాగింది.
హైకోర్టు తీర్పు.. దానం లాయర్లకు నిరాశ..
ఇదిలా ఉంటే.. దానం నాగేందర్ అనర్హత కేసులో హైకోర్టు తీర్పు అనంతరం ఆయన తరఫు న్యాయవాదులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. తీర్పు అమలుపై స్టే విధించాలని.. సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే వరకు గడువు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేను ఇప్పటికిప్పుడు పదవి నుంచి తొలగిస్తే నియోజకవర్గ ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని దానం తరఫు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తీర్పుపై తాత్కాలికంగా స్టే ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు చేసిన స్టే అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.
Also Read:
ఆసియా క్రీడల్లో భారత పతాకధారులుగా మనూ భాకర్, తజీందర్‌పాల్ సింగ్
పెళ్లికి నెల రోజుల ముందు దారుణం.. హత్య చేసి మురుగు కాలువలో పడేసి..