Share News

రేవంత్‌ మరింత శక్తిమంతం!

ABN , Publish Date - Feb 14 , 2026 | 04:41 AM

రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం సర్పంచ్‌ స్థానాలను దక్కించుకుని గ్రామీణ ఓటర్ల మద్దతు పొందిన కాంగ్రెస్‌ పార్టీ..

రేవంత్‌ మరింత శక్తిమంతం!
CM Revanth Reddy

  • మొన్న ‘పంచాయతీ’ విజయంతో పల్లెల మద్దతు

  • ఇప్పుడు ‘మునిసిపల్‌’ గెలుపుతో పట్టణంపైనా పట్టు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం సర్పంచ్‌ స్థానాలను దక్కించుకుని గ్రామీణ ఓటర్ల మద్దతు పొందిన కాంగ్రెస్‌ పార్టీ.. శుక్రవారం వెల్లడైన మునిసిపల్‌ ఎన్నికల్లో ఏకంగా 70 శాతం సీట్లు దక్కించుకుని పట్టణ ఓటర్ల మద్దతూ పొందింది. దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వ రెండేళ్ల పాలనకు అటు పల్లె.. ఇటు పట్టణ ప్రజలు ఆమోద ముద్ర వేసినట్లయ్యిందని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు అంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి గ్రామీణ నియోజకవర్గాల్లోనే ఎక్కువగా సీట్లు వచ్చాయి. తాజాగా మునిసిపల్‌ ఎన్నికల్లో సాధించిన భారీ విజయంతో పట్టణ ప్రాంతాల్లోనూ ప్రభుత్వం పట్ల ఆదరణ పెరిగిందన్నది స్పష్టమైందని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సింపుల్‌ మెజార్టీ నుంచి సుస్థిరత దాకా..!

అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్‌ పార్టీ.. సింపుల్‌ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ప్రభుత్వం ఎక్కువకాలం నిలబడదంటూ బీఆర్‌ఎస్‌ నేతల ప్రకటనలు చేశారు. పైగా పార్టీలోనూ, వయసుపరంగానూ సీఎం కంటే మంత్రులు సీనియర్లు కావడంతో ప్రభుత్వంలో ఒక రకమైన అభద్రతాభావం నెలకొని ఉండేది. అయితే, ఆ తర్వాత వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తున్న కొద్దీ.. ప్రభుత్వం బలపడుతూ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత కంటోన్మెంట్‌ ఉప ఎన్నికతో మొదలైన కాంగ్రెస్‌ విజయ పరంపర.. మునిసిపల్‌ ఎన్నికల వరకూ కొనసాగుతూనే ఉంది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో గెలవటంతోపాటు సర్పంచ్‌ ఎన్నికల్లో 66 శాతం సర్పంచ్‌ సీట్లు దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌.. జూబ్లీహిల్స్‌ సిట్టింగ్‌ సీటును కోల్పోయింది. మరోవైపు బీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్ల తో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ అనుబంధ సభ్యులుగా కొనసాగుతున్నారు. వరుస విజయాలతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మరింత బలంగా.. సు స్థిరంగా మారిందని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


ఆధిక్యం స్పష్టం..!

అసెంబ్లీ ఎన్నికల నాటితో పోల్చితే కాంగ్రె్‌సపై ప్రజల ఆదరణ ప్రస్తుతం భారీగా పెరిగిందని ఆ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు 94 అసెంబ్లీ స్థానాల పరిధిలో జరిగితే, 87 స్థానాల పరిధిలోని కాంగ్రెస్‌ మెజారిటీ సీట్లను గెలిచిందని గుర్తు చేస్తున్నాయి. తాజాగా మునిసిపల్‌ ఎన్నికలు 81 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగితే, 68 స్థానాల పరిధిలో కాంగ్రెస్‌ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించగా.. ఇతర ప్రతిపక్షాలన్నీ కలిసి కూడా 13 నియోజకవర్గాల పరిధిలోనే తమ ప్రభావం చూపాయని అధికార పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. రానున్న పరిషత్‌, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

రేవంత్‌ ముద్ర సుస్పష్టం

మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయంతో సీఎం రేవంత్‌రెడ్డి మరింత శక్తిమంతుడిగా మారారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వరుస విజయాలతో అధిష్ఠానం వద్ద ఆయన మాటకు తిరుగు లేకుండా పోయిందని, ఇకపై పాలనా పరంగాను స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితు లు ఏర్పడ్డాయని చెబుతున్నారు. ప్రభు త్వం సుస్థిరంగా మారడంతో సీఎం రేవంత్‌రెడ్డిలో ఆత్మవిశ్వాసం పెరిగిందని పేర్కొంటున్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో మంత్రులందరూ పాస్‌ అ య్యారు. సీఎం, మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మెజారిటీ మునిసిపాలిటీలు కాంగ్రెస్‌ పార్టీనే గెలుచుకుంది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ సొంత మునిసిపాలిటీ భీంగల్‌, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి నియోజకవర్గం సంగారెడ్డి మునిసిపాలిటీల్లోనూ కాం గ్రెస్‌ పార్టీ గెలిచింది. మెదక్‌ మినహా అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ మెజారిటీ మునిసిపాలిటీలను కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది.

Updated Date - Feb 14 , 2026 | 07:15 AM