తల్లిని అవమానించడాన్ని సమర్థించలేం: పొంగులేటి
ABN , Publish Date - Sep 09 , 2026 | 06:02 AM
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతల తీరు, ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. తల్లిని అవమానించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించలేమని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పేర్కొన్నారు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి
క్షమాపణ చెప్పాలి: ఆది శ్రీనివాస్
తాతా మధుని తొలగించే వరకు
పోరాటం ఆగదు: బల్మూరి
దళితులపై బీఆర్‌ఎస్ చిన్నచూపు: రాంచందర్ నాయక్
తప్పును కప్పిపుచ్చుకునేందుకే
డ్రామాలు: విజయరమణారావు
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతల తీరు, ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. తల్లిని అవమానించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించలేమని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పేర్కొన్నారు. ‘నో ఎక్స్‌క్యూజెస్ ఫర్ అబ్యూజింగ్ ఎ మదర్’ అంటూ ఎక్స్‌లో మంగళవారం ఓ పోస్టు చేశారు. ఇక, స్పీకర్‌ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దూషించిన ఘటనపై కేసీఆర్ స్పందించకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే, విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక, తాతా మధును డిస్మిస్ చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, మహిళా పోలీసుల ఎదుట చొక్కాలు విప్పి బీఆర్‌ఎస్ నేతలు అసభ్యకరంగా ప్రవర్తించారని ఎమ్మెల్సీ, విప్ బల్మూరి వెంకట్ అన్నారు. ఇక, బీఆర్‌ఎస్ నేతలు సోమవారం వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఎమ్మెల్యే రాంచందర్ నాయక్ అన్నారు. దళిత సామాజిక వర్గాన్ని అవమానించేలా బీఆర్‌ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ నేతలు తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే విజయ రమణారావు ఆరోపించారు.