బీజేపీ కుట్రను తిప్పికొట్టాం
ABN , Publish Date - Apr 19 , 2026 | 05:57 AM
మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో అశాస్త్రీయంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయాలని బీజేపీ ప్రయత్నించిందని...
మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్‌కు కుట్ర
బిల్లు వీగిపోవడం ప్రజాస్వామ్య విజయం
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్
లోక్‌సభ నిర్ణయం నియంతృత్వ బీజేపీకి చెంపపెట్టు: పొన్నం
హైదరాబాద్, మహబూబ్‌నగర్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో అశాస్త్రీయంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయాలని బీజేపీ ప్రయత్నించిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. లోక్‌సభలో శుక్రవారం 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం ప్రజాస్వామ్య విజయమని అన్నారు. శనివారం గాంధీ భవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ఇతర ముఖ్య నేతలతో కలిసి మహేశ్‌గౌడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ కుట్రలను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్‌గాంధీల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సమర్థంగా అడ్డుకుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని, దానిని డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్నే వ్యతిరేకించామని స్పష్టం చేశారు. బీజేపీలో ఒక్క మహిళనైనా జాతీయ అధ్యక్షురాలిగా చేశారా? అని ప్రశ్నించారు. దేశానికి తొలి మహిళా ప్రధానిని, మహిళా రాష్ట్రపతిని, మహిళా లోక్‌సభ స్పీకర్‌ను అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చుతూబీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతలు మౌనంగా ఉండటం సిగ్గుచేటని మహేశ్‌గౌడ్ మండిపడ్డారు. అంతకుముందు ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ 2023లోనే మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. దేశాన్ని రాజకీయంగా కబళించాలని బీజేపీ పన్నిన కుట్రలను ఇండియా కూటమి గొప్పగా తిప్పికొట్టిందని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. శనివారం సీఎల్పీ మీడియా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ముందుగానే స్పందించి దక్షిణాది ముఖ్యమంత్రులను ఏకం చేయడంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. మరో విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీజేపీకి మహిళల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే మహిళా బిల్లును విడిగా పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ మరోసారి మహిళలను అవమానించిందని మహిళా కార్పొరేషన్ చైర్‌పర్సన్ శోభారాణి విమర్శించారు.
నియంతృత్వ బీజేపీకి చెంపపెట్టు
ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతృత్వానికి తావులేదని మరోమారు లోక్‌సభ నిరూపించిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం ఆయన మహబూబ్‌నగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కుట్ర పూరితంగా మహిళా బిల్లుకు లంకె పెట్టి డీలిమిటేషన్ బిల్లును తెచ్చిందని ఆరోపించారు. ఏమాత్రం ప్రజాస్వామిక విలువలున్నా, నైతికత ఉన్నా బిల్లు వీగిపోయినందున కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడితే.. మౌనంగా ఉండిపోయిన తెలంగాణ బీజేపీ ఎంపీలు తెలంగాణ బిడ్డలేనా అనేది డీఎన్‌ఏ పరీక్ష చేయించుకోవాలని ఎద్దేవా చేశారు.