Share News

రూ. 30కోట్ల సీఎంఆర్‌ ధాన్యం పక్కదారి!

ABN , Publish Date - Oct 30 , 2026 | 05:42 AM

పేదల ఆహారభద్రత కోసం ప్రభుత్వం కేటాయించిన సీఎంఆర్‌ ధాన్యం పక్కదారి పట్టింది

రూ. 30కోట్ల సీఎంఆర్‌ ధాన్యం పక్కదారి!
rice

  • మెదక్‌, యాదాద్రి జిల్లాల్లో విజిలెన్స్‌, పౌరసరఫరాల తనిఖీలు

మెదక్‌/ యాదాద్రి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): పేదల ఆహారభద్రత కోసం ప్రభుత్వం కేటాయించిన సీఎంఆర్‌ ధాన్యం పక్కదారి పట్టింది. మెదక్‌ , యాదాద్రి భువనగిరి జిల్లాల్లో విజిలెన్స్‌, పౌరసరఫరా శాఖ అధికారులు చేపట్టిన తనిఖీల్లో భారీస్థాయిలో ధాన్యం గల్లంతైనట్లు తేలింది. ఈ రెండు జిల్లాల్లో కలిపి దాదాపు రూ. 30కోట్ల విలువైన 10వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి సంబంధించి అక్రమాలు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. మెదక్‌ జిల్లా నిజాంపేట మండలం నస్కల్‌లోని శ్రీవిద్య రైస్‌ మిల్లులో 2022- 23 యాసంగితో పాటు 2024- 25 సీజన్‌కు సంబంధించి రూ. 12 కోట్లు విలువ చేసే 5 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వలు గల్లంతైనట్లు గుర్తించారు. అలాగే మెదక్‌ మండలం మంబోజిపల్లిలోని మంజీరా మిల్లులో రూ.5 కోట్ల విలువైన 2 వేల మెట్రిక్‌ టన్నుల ఽధాన్యం లెక్కల్లో తేడా వచ్చింది. ఈ రెండు మిల్లుల్లో గల్లంతైన ధాన్యం విలువ సుమారు రూ.17 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కాగా, జిల్లాలో ఐదు రైస్‌ మిల్లుల వద్దే సుమారు రూ.50 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, మిగతా 50 మిల్లుల్లో కలిపి మరో రూ.40 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని వెల్లడించారు. హవేలీఘనపూర్‌లో రాజేశ్వరీ రైస్‌ మిల్లులో రూ.8 కోట్లు, వెల్దుర్తిలోని శ్రీ సాయి రైస్‌ మిల్లులో రూ.10 కోట్లు, తూఫ్రాన్‌లోని సాయినాథ రైస్‌మిల్లులో రూ.8 కోట్ల బకాయిలు ఉన్నట్లు గుర్తించారు. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్‌పోచంపల్లి మండలం రేవన్‌పల్లిలోని శ్రీవిజయదుర్గా రైస్‌ మిల్లుల్లో రూ. 13.77కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు అధికారులు లెక్క తేల్చారు. పౌరసరఫరాల శాఖ ప్రతి బుధవారం జరిపే ఫిజికల్‌ వెరిఫికేషన్‌లో భాగంగా సెప్టెంబరు 30న నిర్వహించిన తనిఖీల్లో.. 3,731 టన్నుల ధాన్యం తక్కువగా ఉన్నట్టు నిర్ధారించారు. ధాన్యాన్ని పక్కదారి పట్టించినందుకు మిల్లు నిర్వాహకులపై గురువారం పోచంపల్లి పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది.

Updated Date - Oct 30 , 2026 | 06:22 AM