Share News

బ్రాండ్‌ అంబాసిడర్లుగా..

ABN , Publish Date - Jan 30 , 2026 | 04:04 AM

తెలంగాణకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరించాలని హార్వర్డ్‌ యూనివర్సిటీలోని భారత విద్యార్థులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

బ్రాండ్‌ అంబాసిడర్లుగా..

  • తెలంగాణలోని అవకాశాలను తెలియజేయండి

  • హార్వర్డ్‌లోని భారతీయ విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్‌ పిలుపు

  • నేటితో ముగియనున్న క్లాసులు.. రేపు సర్టిఫికెట్‌ ప్రదానం

హైదరాబాద్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరించాలని హార్వర్డ్‌ యూనివర్సిటీలోని భారత విద్యార్థులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. రాష్ట్రంలోని అవకాశాలను ఇక్కడ తెలియజేయాలని, తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీలో సర్టిఫికెట్‌ కోర్సును అభ్యసిస్తున్న సీఎం రేవంత్‌ను అక్కడ చదువుతున్న భారతీయ విద్యార్థి బృందం తమ క్యాంప్‌సను సందర్శించాలని ఆహ్వానించింది. ఈమేరకు తన అసైన్‌మెంట్లు, హోం వర్క్‌లు పూర్తయిన తరువాత రేవంత్‌ విద్యార్థులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి భవిష్యత్‌ లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన రాజకీయ ప్రస్థానం, సీఎం కావడానికి దోహదపడిన అంశాలతోపాటు తన విజయ మంత్రాన్ని వారికి వివరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రూపొందించిన తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను తెలియజేశారు. భారత్‌ అభివృద్ధిలో విద్యార్థులు కీలకమని, వారి ప్రతిభ దేశాభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు. కాగా, హార్వర్డ్‌ యూనివర్సిటీలో సీఎం రేవంత్‌ హాజరవుతున్న సర్టిఫికెట్‌ కోర్సు క్లాసులు శుక్రవారంతో ముగియనున్నాయి. శనివారం సర్టిఫికెట్‌ ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆదివారం ఆయన అమెరికా నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనం కానున్నారు.

Updated Date - Jan 30 , 2026 | 04:04 AM