బండి సంజయ్ కొడుకు కేసులో ప్రత్యేక అధికారితో విచారణ
ABN , Publish Date - May 12 , 2026 | 03:56 AM
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విచారణ కోసం ప్రత్యేక అధికారిని నియమించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
పేట్ బషీరాబాద్‌లో ఫిర్యాదు చేసిన బాధితురాలు .. బండి భగీరథ్ కూడా కరీంనగర్‌లో ఫిర్యాదు చేశాడు
రెండింటిపైనా విచారణ చేయాలని డీజీపీని ఆదేశించాను
8నే బాధితురాలి ఫిర్యాదు.. ప్రధాని పర్యటన నేపథ్యంలో విచారణ ఆలస్యమైందని డీజీపీ చెప్పారు
చట్టానికి ఎవరూ అతీతులు కాదు
బీఆర్‌ఎస్ వాళ్లు కోరుతున్నట్టు క్షణాల మీద ఏదీ జరగదు
మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్
హైదరాబాద్, మే 11 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విచారణ కోసం ప్రత్యేక అధికారిని నియమించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంపై డీజీపీ సీవీ ఆనంద్‌తో సమీక్షించానని, వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించానని చెప్పారు. అయితే బాధితురాలు పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, బండి భగీరథ్ కరీంనగర్‌లో ఫిర్యాదు చేశాడని తెలిపారు. దీంతో రెండు ఫిర్యాదులపైనా ప్రత్యేకంగా విచారణ చేయాలని సూచించినట్టు పేర్కొన్నారు. సోమవారం మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. బాధితురాలు ఈ నెల 8నే ఫిర్యాదు చేసినా చర్యలు ఎందుకు తీసుకోలేదని డీజీపీని ప్రశ్నించినట్టు తెలిపారు. అయితే ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో దాదాపు 10 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేయాల్సి వచ్చిందని, ఆ ఏర్పాట్లలో నిమగ్నం కావడం వల్లే జాప్యం జరిగిందని డీజీపీ చెప్పారని పేర్కొన్నారు. ఇప్పుడు విచారణ ప్రారంభమవుతోందని, విచారణ తరువాత పోలీసులు చర్యలు తీసుకుంటారని అన్నారు. అయితే బీఆర్‌ఎస్ వాళ్లు కోరుతున్నట్టు క్షణాల మీద ఏదీ జరగదని, ఎవరిపైనైనా చట్ట ప్రకారమే చర్యలుంటాయని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ గతంలో పోలీస్‌శాఖలో పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. భగీరథ్‌పై ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసిందీ పోలీసులేనని, ఈ విషయం ప్రవీణ్‌కుమార్‌కు తెలియదా? అని ప్రశ్నించారు.
కేటీఆర్ బావమరిదినీ వదల్లేదు..
చట్టానికి ఎవరూ అతీతులు కాదని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పటివరకు తాము ఎవరినీ వదిలిపెట్టలేదన్నారు. ఫాంహౌస్‌లో డ్రగ్స్ తీసుకుని దొరికిన కేటీఆర్ బావమరిదిని కూడా వదల్లేదని తెలిపారు. కేటీఆర్, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఖాళీగా ఉన్నామని డ్యూటీ చేస్తామంటే ఎలా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హయాంలో తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఎన్నికల కమిషన్‌కు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారని సీఎం గుర్తు చేశారు. అయితే విచారణ సమయంలో ఆయనను పిలిస్తే.. ప్రభాకర్‌రావు నీతిమంతుడన్న చందంగా మీడియా ఎదుట మాట్లాడారని తెలిపారు. గడీలు బద్దలు కొడతానని, బీఆర్‌ఎస్ హయాంలో విద్యా వ్యవస్థ కుప్పకూలిపోయిందని గతంలో చెప్పిన ప్రవీణ్‌కుమార్.. ఇప్పుడు అదే గడీల ముందు తిరుగుతున్నారని అన్నారు. మైకుల ముందు నాయకులు ఇచ్చే స్టేట్‌మెంట్ల ఆధారంగా కేసుల విచారణ జరగదని, ప్రవీణ్‌కుమార్ వద్ద ఏవైనా ఆధారాలుంటే పోలీస్ కమిషనర్‌కు ఇవ్వొచ్చని సూచించారు. ప్రధాని మోదీ సభకు 48 గంటల ముందే బండి భగీరథ్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. ఈ కేసు మైనర్‌కు సంబంధించినదని, అంతా భాద్యతాయుతంగా ఉండాలని సూచించారు.
21న క్యాబినెట్ భేటీ
ఈ నెల 21 రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ భేటీలో పలు నిర్ణయాలు తీసుకోనున్నట్టు చెప్పారు. జర్నలిస్టుల ఇంటి స్థలాల విషయంలో ఈ నెల 21లోపు సొసైటీలన్నీ ఒక నిర్ణయానికి వస్తే.. దానిపై క్యాబినెట్‌లో చర్చిస్తామన్నారు.